పిల్లలు ఏఐ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు! | Children are becoming more dependent on AI | Sakshi
Sakshi News home page

పిల్లలు ఏఐ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు!

Sep 10 2026 3:04 AM | Updated on Sep 10 2026 3:04 AM

Children are becoming more dependent on AI

ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నది స్కూల్‌ పిల్లలే. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, పిల్లలు పెద్దల కంటే మూడు రెట్లు వేగంగా కృత్రిమ మేధ సాంకేతికతలను స్వీకరిస్తున్నారు. లక్షలాది మంది పిల్లలు హోంవర్క్‌ చేయడానికి చాట్‌బాట్‌ల సహాయం తీసుకుంటున్నారు. కౌమారదశలో ఉన్న వారు స్కూల్‌ ప్రాజెక్టులు చేయడానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఏఐని అనుసంధానం చేస్తున్నారని ఇటీవలి ప్రపంచ స్థాయి గణాంకాలు చూపిస్తున్నాయి.    

» లక్షలాదిమంది పిల్లలు తమ సందేహాలు తీర్చుకోవడానికి ఏఐ మీద ఆధారపడుతున్నారు. బాల్యంలో కలిగే సందేహాలు ఒక ఎత్తయితే, కౌమారంలోకి అడుగుపెట్టినప్పుడు అనేక సందేహాలు వేధిస్తుంటాయి. పెద్ద వాళ్ల దగ్గర వ్యక్తం చేయడానికి సంకోచించే సందేహాల నివృత్తి కోసం ఏఐని ఆశ్రయిస్తున్నారు. వ్యక్తిగత ఆందోళనల నుంచి బయటపడడానికి మార్గాలను చూపించమని కోరుతున్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కడానికి కూడా చాట్‌బాట్‌లనే ఎంచుకుంటున్నారు.

» యూనిసెఫ్‌ కొన్ని దేశాల్లో ఏఐ వినియోగం మీద సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం ‘పిల్లలు పెద్దవాళ్ల కంటే మూడురెట్లు ఎక్కువ వేగంతో కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటున్నారు. 20 మిలియన్లకు పైగా పిల్లలు ఏఐని ఉపయోగిస్తుండగా, వారిలో 13 మిలియన్ల మంది పాఠశాల పని కోసం, 2 మిలియన్ల మంది జీవిత సలహాల కోసం వాడుతున్నారు.

»  కెనడా 2026 అధ్యయనం ప్రకారం పిల్లల్లో ఐదుగురిలో ఒకరు ఏఐ నుంచి ఎమోషనల్‌ సపోర్టు తీసుకుంటున్నారు. ముఖ్యంగా న్యూక్లియర్‌ కుటుంబాల్లో సింగిల్‌ చైల్డ్‌ ఒంటరితనం కారణంగా ఏఐని ఫ్రెండ్‌గా మార్చుకుంటున్నారు.

» కామన్‌సెన్స్‌ మీడియా, ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ల సర్వేల నివేదిక ప్రకారం 64 నుంచి 70 శాతం టీనేజర్లు సమాచారం వెతకడానికి, మేధోమథనం చేయడానికి, హోమ్‌వర్క్‌ చేయడానికి ఏఐ చాట్‌బాట్‌లను వాడుతున్నారు.

ప్రమాదాలూ ఉన్నాయి!
» కాగ్నిటివ్‌ ఆఫ్లోడింగ్‌: ఏఐ షార్ట్‌కట్‌లపై ఎక్కువగా ఆధారపడటం వలన జ్ఞానం మెదడు పొరల్లో దీర్ఘకాలం నిక్షిప్తం కాలేదు. ఏకాగ్రతతో అభ్యసించడం ద్వారా మెదడు అభివృద్ధి చెందుతుంది. ఏఐ ఈ ప్రక్రియకు ఆటంకం.
»  ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) వంటి విద్యా నివేదికలు మితిమీరిన ఏఐ వాడకం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోజువారీ పాఠ్యాంశాల అభ్యాసంలో ఏఐని వాడడం వల్ల పరీక్షల్లో మార్కులు తగ్గడం, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు క్షీణించడం వంటి ప్రమాదాలను హెచ్చరిస్తున్నాయి. 
»  ఏఐ గొప్ప ట్యూటర్‌గా పని చేస్తోంది, తక్షణం ఫలితాలనిస్తుంది. కానీ ఆ సాధనం లేకుండా సొంతంగా మెదడుతో ఆలోచించి పనిచేసే సామర్థ్యాన్ని పెంచడం లేదని అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది.
» అత్యంత ఆందోళన కలిగించే అంశం తప్పుడు సమాచారం. స్కామ్, సామాజిక అంశాల విషయంలో పక్షపాత ధోరణితో, అర్ధవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా కూర్చిన సమాచారాన్ని నూరుశాతం నిజమని నమ్మే ప్రమాదం లేకపోలేదు.
» బహిర్గతమైన భయాలు: మూడింట ఒక వంతు మంది పిల్లలు ఆన్‌లైన్‌ మోసాలు, తప్పుడు సమాచారం గురించి ఆందోళన చెందుతుండగా, నాలుగింట ఒక వంతు మంది లైంగికంగా అసభ్యకరమైన డీప్‌ఫేక్‌లకు భయపడుతున్నారు.

వాస్తవాన్ని గుర్తించడం...
ఏఐ రూపొందించిన కంటెంట్‌ను, మనిషి సృష్టించిన కంటెంట్‌ నుంచి వేరు చేసి చెప్పడంలో పిల్లలు ఇబ్బంది పడతారు. పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ తేడాను గుర్తించే కచ్చితత్వం తగ్గుతుందని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌’ చెబుతోంది.
»  తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో అభ్యాసం కొనసాగితే అర్ధవాస్తవాలను, పక్షపాత ధోరణి సమాచారాన్ని వడపోసి పిల్లలను కచ్చితమైన సమాచారం వైపు నడిపించడం జరుగుతుంది. ఏఐ విషయంలో అలాంటి భద్రత లేకపోవడం ఆలోచించాల్సిన అంశం అని విద్యావేత్తల సూచన. 

– సాక్షి, స్పెషల్‌ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement