'ఏఐ' జోస్యం.. చేతిలోనే 'జాతకం'! | The use of AI astrology apps in the country has increased by 300 percent | Sakshi
Sakshi News home page

'ఏఐ' జోస్యం.. చేతిలోనే 'జాతకం'!

Sep 7 2026 2:53 AM | Updated on Sep 7 2026 2:53 AM

The use of AI astrology apps in the country has increased by 300 percent

క్యూ లేదు.. ఫీజు లేదు.. ఫోన్‌ కొడితే చాలు ‘కుండలి’రెడీ  

మనుషుల్ని మించి చెబుతున్న చాట్‌బాట్‌ పండితులు 

కోట్లలో దూసుకెళ్తున్న జోస్యం యాప్స్‌.. రోజుకు లక్ష మందికి పంచాంగం  

ఫేస్‌ రీడింగ్‌ నుంచి పెళ్లి ముహూర్తం వరకు.. తెలుగులోనే చెబుతున్న చాట్‌బాట్‌ 

మనశ్శాంతి కోసం యువత మొగ్గు.. నమ్మకమా, టెక్నాలజీ వలయమా?

కూకట్‌పల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనఘకు అమెరికా ఆఫర్‌ వచ్చింది. వెళ్లాలా వద్దా అని కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ‘రాత్రి 11 గంటలకు ఒక యాప్‌లో ఫ్రీ చాట్‌ చేశా. 2 నిమిషాలకే ఫ్రీ అయ్యా. తర్వాత డబ్బులు అడిగింది. శని వక్రంలో ఉన్నాడు..రెండు నెలలు ఆగమంది. చెప్పింది బాగానే ఉంది కానీ జనరల్‌ మాటల్లా అనిపించింది’అంటోంది. 

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమేశ్‌ పెళ్లి సంబంధం కోసం అమ్మాయి జాతకం కలవాలని చూస్తున్నాడు. ‘సిద్ధాంతి దగ్గరకు వెళ్తే రోజంతా వేస్ట్‌ అని.. ఒక యాప్‌లో 36 గుణాలు ఫ్రీగానే చెక్‌ చేశా. వెంటనే మాంగళిక దోషం ఉందని, పరిహారం కూడా చెప్పేసింది. టైం, డబ్బు కలిసొచ్చాయి’అన్నాడు.  

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు జాతకం అంటే తెల్లవారుజామునే లేచి సిద్ధాంతి ఇంటి ముందు క్యూలో నిలబడటం. పుట్టిన వేళ, నక్షత్రం చెబితే ఆయన కాగితంపై లెక్కలు వేసి, గంట తర్వాత లగ్నం, రాశి, దశ, ఏలినాటి శని, మంగళ దోషం చెప్పేవారు. పెళ్లి కుదరాలన్నా..ఉద్యోగం రావాలన్నా..ఇల్లు కట్టాలన్నా ఆయన మాటే శాసనం. కానీ ఇప్పుడు ఆ సీన్‌ మొత్తం మారిపోయింది. ఆ సిద్ధాంతి మీ జేబులోని ఫోన్‌లోకే వచ్చేశాడు. పేరే ఏఐ పండితుడు. గత రెండేళ్లలో దేశంలో ఏఐ జోతిష్య యాప్స్‌ వాడకం 300 శాతం పెరిగింది. మొత్తం ఇండస్ట్రీ విలువ ఏకంగా 6 బిలియన్‌ డాలర్లకు చేరింది. గూగుల్‌ ప్లే స్టోర్‌ లెక్కల ప్రకారం వివిధ యాప్స్‌ ఇప్పటికే 8 కోట్ల డౌన్‌ లోడ్స్‌ దాటేశాయి. రోజుకు లక్ష మందికి పైగా యువత ఏఐతోనే దినఫలం, జాతకం తెలుసుకుంటోంది.

పండితుడు చేసేది
మీ పుట్టిన వివరాలు తీసుకొని పంచాంగం చూసి, కుండలి (జాతక చక్రం) గీసి, దోషాలు లెక్కించి, ముహూర్తం చెప్పేవా రు. దీనికి గంటల సమయం, రూ.500 నుంచి రూ.2000 ఫీజు. 

యాప్‌ చేసేది 
మీరు పుట్టిన తేదీ, టైం, ఊరు కొట్టగానే నాసా డేటా, స్విస్‌ ఎఫిమెరిస్‌ లెక్కలతో 10 వేల పాయింట్లతో 5 సెకన్లలోనే కుండలి రెడీ. లగ్నం, రాశి, నక్షత్రం, దశ, అంతర్దశ, యోగాలు, మంగళ దోషం, కాలసర్ప దోషం అన్నీ తెలుగులోనే గ్రాఫ్‌తో సహా చూపిస్తోంది. 

ఏఐ జోస్యం ప్రామాణికం కాదు 
ఏఐ అనేది కేవలం లెక్కలు వేసే యంత్రం మాత్రమే. గ్రహ గతుల లెక్కలు కరెక్ట్‌గా వేయగలదు కానీ, మనిషి మనసు, కర్మ, అ నుభవంతో చెప్పే సూక్ష్మాన్ని, విచక్షణను చెప్పలేదు. ఏఐ ఇచ్చే ది బార్నమ్‌ స్టేట్‌మెంట్స్‌ లాంటి జనరల్‌ జోస్యం. సింహరాశి వాళ్లందరికీ ఒకే ఫలితం ఎలా ఉంటుంది? 20 ఏళ్ల యువకుడికి ఉద్యోగం, 26 ఏళ్ల వాడికి పెళ్లి, 40 ఏళ్ల వాడికి ఇల్లు, కారు, 70 ఏళ్ల పెద్దాయనకు ఆరోగ్యం.. ఇలా వయసు, దశను బట్టి ఫలితం మారుతుంది. దీన్ని ఏఐ చెప్పలేదు. కాబట్టి ఏఐ ద్వారా వచ్చే ఫలితాలు ఎప్పటికీ ప్రామాణికం కావు.  – సిద్ధాంతి ఆదరాసుపల్లి విఠల్‌ శర్మ

ఎలా వాడుతున్నారు? 
చాట్‌బాట్‌ పండితుడు: ‘నా పెళ్లి ఎప్పుడు..నాకు ప్రమోషన్‌ ఉందా? ’అని తెలుగులోనే టైప్‌ చేసినా, లేదా వాయిస్‌లో అడిగినా, వెంటనే వాయిస్‌లోనే సమాధానం. 50 భాషల్లో మాట్లాడుతోంది. 
ఫేస్‌ అండ్‌ పామ్‌ రీడింగ్‌: మీ మొహం ఫొటో, అరచేయి ఫొటో అప్‌లోడ్‌ చేస్తే ఏఐ స్కాన్‌ చేసి హస్త సాముద్రికం, ఫేస్‌ లక్షణాలతో జాతకం చెబుతోంది. పండితుడు కళ్లతో చూసి చెప్పేది ఇప్పుడు కెమెరా చెబుతోంది. 
పెళ్లి పొంతన, ముహూర్తం: అబ్బాయి, అమ్మాయి వివరాలు కొడితే 36 గుణాలు, మాంగళిక దోషం సెకన్లలో. శుభ ముహూర్తం కూడా కేలండర్‌లో మార్క్‌ చేసి పెడుతోంది. పండితుడు రోజంతా లెక్కేసేది ఇప్పుడు ఒక్క క్లిక్‌. 
పరిహారాలు : ఏ దోషానికి ఏ రాయి వేసుకోవాలి, ఏ పూజ చేయాలి, ఏ మంత్రం చదవాలి అనేది కూడా వీడియోలతో సహా సూచిస్తోంది. వేద, వెస్ట్రన్‌ కలిపి చెబుతుండటంతో యువత బాగా అట్రాక్ట్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement