అసెంబ్లీ తొలిరోజు ఎజెండా ఇదే..
బీఏసీ భేటీ తర్వాతే సభ పూర్తి ఎజెండాపై స్పష్టత
నేడే సెంట్రల్ హాల్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శాసనసభలో చేపట్టాల్సిన అధికారిక కార్యక్రమాలతో కూడిన ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’ను శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి జారీ చేశారు. తొలిరోజు ఎజెండాలో భాగంగా ప్రశ్నోత్తరాలతో పాటు పలు కీలక నివేదికలను సభకు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎస్‌ఎస్)కు సంబంధించిన 2024–25 ఆడిట్ నివేదికను సభ ముందుంచుతారు. అలాగే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) తెలంగాణకు సంబంధించిన 2024–25 ఆడిట్ నివేదికను కూడా ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు సంబంధించిన 2013–14, 2014–15, 2015–16, 2016–17, 2017–18 వార్షిక నివేదికలను సభ ముందుంచనున్నారు.
బీఏసీలో పలు అంశాలపై చర్చ
అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలు తదితర అంశాలపై తుది నిర్ణయం.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకోనున్నారు. తొలిరోజు సభ ముగిసిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సమావేశాలను తక్కువ వ్యవధిలోనే ముగించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ నెల 13 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటేరియన్ల సమావేశాలకు హాజరు కావాల్సి ఉండటంతో 11వ తేదీ మధ్యాహా్ననికే సమావేశాలు ముగించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అయితే దీనిపై సోమవారం జరిగే బీఏసీ భేటీలోనే స్పష్టత రానుంది. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, భూవివాదాలు, సాగునీరు, 22ఏ నిషేధిత భూముల అంశం తదితర ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఏసీ సమావేశం కీలకంగా మారింది. మరోవైపు అసెంబ్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సెంట్రల్ హాల్‌లోకి కేవలం ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.


