ఉద్యోగుల ఆరోగ్యభద్రత ప్రభుత్వ ప్రాధాన్యం | Bhatti Vikramarka says Health and safety of employees is a priority of govt | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఆరోగ్యభద్రత ప్రభుత్వ ప్రాధాన్యం

Sep 7 2026 2:27 AM | Updated on Sep 7 2026 2:27 AM

Bhatti Vikramarka says Health and safety of employees is a priority of govt

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి. చిత్రంలో సీఎస్‌ జాజు

ఈహెచ్‌ఎస్‌ అమలులో రాజీ ప్రసక్తే లేదు

ప్రస్తుతం 354 ప్రైవేట్‌ ఆస్పత్రులు..

త్వరలో మరిన్ని ఆస్పత్రుల చేరికకు చర్యలు

ట్రస్టు బోర్డు భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యభద్రత విషయంలో ప్రజాప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన ఎంప్లాయీస్‌ హెల్త్‌స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) అమలులో ఎలాంటి రాజీ ఉండదని వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఈహెచ్‌ఎస్‌ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లకు అనారోగ్య సమయంలో ఆర్థిక, మానసిక ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్య భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే హెల్త్‌ స్కీమ్‌ అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దశాబ్దాలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.  

ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాతే విధివిధానాలు 
ఈహెచ్‌ఎస్‌ పథక రూపకల్పన, విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే విధివిధానాలు ఖరారు చేశామని భట్టి తెలిపారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే ఈహెచ్‌ఎస్‌లో 354 ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉన్నాయని, మరికొన్ని ఆస్పత్రులను డీమ్డ్‌ ఎంప్యానెల్డ్‌ విధానంలో చేర్చినట్టు వెల్లడించారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారులు సమావేశాలు నిర్వహించి పథకం సజావుగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులకు హెల్త్‌ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.  

పదేళ్లుగా పట్టించుకోని సమస్యకు పరిష్కారం 
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్‌కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఉద్యోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా, కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ మహేశ్‌దత్‌ ఎక్కా, ఆరోగ్య, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, ఈహెచ్‌ఎస్‌ సీఈఓ హనుమంతు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement