24 గంటల్లో బాలుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి మూడేళ్ల బాలుడిని ఓ మహిళ శనివారం కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితులైన భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. వివరాలను జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీపీ సాయి చైతన్య వెల్లడించారు. బాలుడి ఆచూకీపై ఆదివారం ఉదయం సమాచారం రావడంతో సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నిందితుల ఉనికిని గుర్తించామన్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌కు చెందిన కోతాడి సుజాత, ఎల్లం దంపతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫొటోలను మీడియా విస్తృతంగా ప్రచారం చేయడంతో గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యమైందన్నారు.
కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, సీఐ రఘుపతి, సాంకేతిక సిబ్బందిని అభినందించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి బాల్కొండ మండలం నాగేపూర్‌కు చెందిన సంధ్య, నరేశ్ దంపతులు మూడో కాన్పు కోసం వచ్చారు. వీరి చిన్న కుమారుడు వేదాన్ష్ ను చాక్లెట్ ఆశ చూపుతూ మహిళ బయటకు తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల ఫొటోలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో వీరి ఉనికిని గమనించిన ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫలితంగా 24 గంటల్లోనే బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.


