44 మంది పిల్లల ప్రాణాలు రక్షించిన పోలీసులు | Thailand kindergarten shooting all 44 children evacuated safely | Sakshi
Sakshi News home page

44 మంది పిల్లల ప్రాణాలు రక్షించిన పోలీసులు

Sep 9 2026 4:42 PM | Updated on Sep 9 2026 5:40 PM

Thailand kindergarten shooting all 44 children evacuated safely

Representative Image

థాయ్‌లాండ్‌ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంలో బుధవారం ఓ కిండర్‌గార్టెన్‌ టీచర్‌ను ఓ దుండగుడు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలో ఉన్న 44 మంది పిల్లలతో పాటు మరో ముగ్గురు టీచర్లను సురక్షితంగా బయటకు తరలించారు.

ఈ దాడి చోన్‌బురి ప్రావిన్స్‌లోని నాంగ్‌ప్లాలై మున్సిపల్‌ కిండర్‌గార్టెన్‌లో ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడిలో ఏ విద్యార్థికీ గాయాలు కాలేదని చోన్‌బురి ప్రావిన్షియల్‌ ప్రభుత్వం తెలిపింది.

ఇటీవల మృతి చెందిన ఓ మహిళ భర్తగా భావిస్తున్న నిందితుడు కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతను ఉంటున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటన అనంతరం పాఠశాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు, సిబ్బందికి మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అందించాలని చోన్‌బురి గవర్నర్‌ నరిట్‌ నిరమైవోంగ్‌ ఆదేశించారు.

గతంలోనూ కాల్పులు
ఆగస్టులో 14 ఏళ్ల విద్యార్థి తన హైస్కూల్‌, నివాస ప్రాంతంలో కాల్పులు జరిపి 8 మందిని చంపి, 20 మందికి పైగా గాయపరిచాడు. ఘటన తర్వాత థాయ్‌లాండ్‌లో పాఠశాలల భద్రత, తుపాకీ హింసపై ఆందోళనలు పెరిగాయి. ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో కాంఫెంగ్‌ ఫెట్‌ ప్రావిన్స్‌లో మరో 14 ఏళ్ల బాలుడిని పాఠశాలలో పలు రౌండ్లు కాల్పులు జరిపిన కేసులో అరెస్టు చేశారు. ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

తుపాకులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొత్త తుపాకుల కొనుగోలు అనుమతులను నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఉన్న అనుమతులను సమీక్షించాలని థాయ్‌లాండ్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఆసియాలో తుపాకుల యాజమాన్య రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో థాయ్‌లాండ్‌ ఒకటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement