ఎస్టీ వృద్ధురాలిపై ఖాకీ కావరం | AP Police Abuse Elderly Woman | Sakshi
Sakshi News home page

ఎస్టీ వృద్ధురాలిపై ఖాకీ కావరం

Sep 8 2026 6:23 AM | Updated on Sep 8 2026 6:23 AM

AP Police Abuse Elderly Woman

అసభ్య పదజాలంతో చీరాల టూటౌన్‌ సీఐ దుర్భాషలు 

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌  

చీరాల:  షెడ్యూల్‌ ట్రైబ్‌ (ఎస్టీ) వర్గానికి చెందిన వృద్ధురా­­లిౖ­పె చీరాల టూటౌన్‌ సీఐ శశికుమార్‌ రెచ్చిపోయారు.  అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. దీనికి సబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సీఐ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.  చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదినారాయణపురానికి చెందిన డెబ్బై ఏళ్ల మట్రా జాలమ్మ భర్త 20 ఏళ్ల కిందట మృతిచెందాడు. ఆమె కూతురు వద్దనే ఉంటూ ఇళ్లలో పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉదయం ఆదినా­రాయణపురంలో కార్డన్‌ సెర్చ్‌ను పోలీసులు నిర్వహించారు. ఆ సమయంలో టూటౌన్‌ సీఐ శశికుమార్‌ తనిఖీలు చేస్తూ జాలమ్మ ఇంటికి వచ్చారు. ఉన్నట్టుండి సీఐ వృద్ధురాలిపై అసభ్య పదజాలం లంకించుకున్నారు. 

నోటికొ­చ్చినట్టు దుర్భాషలాడారు. లాఠీ ఎత్తి కొట్టినంత పనిచే­శారు. ఇంటిలోకి వెళ్లి వంటగది తలుపును కాలితో తన్ని ఖాకీ క్రౌర్యం ప్రదర్శించారు. ఈ వ్యవహారం అంతా అక్క­డున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు సీఐ తీరును తప్పుబడుతున్నారు. ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు బాధితురాలిని పరామర్శించారు. 

ఘటనపై   సోమవారం జిల్లా అడిషనల్‌ ఎస్పీ సుధాకర్‌కు వినతి­పత్రం అందజేశారు. ఘటనపై స్పందించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ విచారణ చేసి నివేదిక సమర్పించాలని చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్‌ను ఆదేశించినట్లు సమా­చారం. ఇదిలా ఉంటే చీరాల సబ్‌ డివిజన్‌లో పోలీసుల వ్యవహార శైలిపై గతంలోనూ విమర్శలు వినిపించాయి. వేటపాలెం ఎస్‌ఐ ఓ చేనేత కార్మికుడితో దురుసుగా మాట్లాడిన వీడియో అప్పట్లో చర్చనీయాంశమైంది. 

జిల్లా ఎస్పీ విచారణ: ఈ ఘటనపై జిల్లా ఎస్పీ బి.ఉమామ­హేశ్వర్‌ స్పందించారు. సీఐ నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పేరం విజయ్, కార్తీక్‌ అనే ఇద్దరిపై క్రిమినల్, నాటుసారా, గంజాయి అమ్మకం కేసులు ఉన్నాయని, వారి ఇల్లు, పరిసరాలను తనిఖీ చేయడానికి సీఐ అక్కడకు వెళ్లారన్నారు. అందుకు ఆ ఇంట్లో ఉన్న 
వృద్ధురాలు తనిఖీలకు సహకరించకపోవడం వల్ల సీఐ దురుసుగా ప్రవర్తించారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదేనా.. ఫ్రెండ్లీ పోలీస్‌ గుండా సురేంద్ర
సాక్షి,అమరావతి: మాది ఫ్రెండ్లీ పోలీస్‌ కాన్సెప్ట్‌ అని మాట్లాడే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం, ఆచరణలో మాత్రం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం (మైదాన ప్రాంతం)రాష్ట్ర అధ్యక్షుడు గుండా సురేంద్ర ధ్వజమెత్తారు. చివరికి వృద్ధ మహిళలను కూడా పోలీసులు వదలటం లేదని సోమవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని, ఆ పోలీస్‌ అధికారిపై చట్టపరమైన చర్యలతో పాటు, శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డీజీపీ తక్షణమే స్పందించాలని,  లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తుందని సురేంద్ర హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement