పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి
గుంటూరు బాలిక మిస్సింగ్ కేసులో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం
బాలికను హైకోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
సాక్షి, అమరావతి: గుంటూరుకు చెందిన పదవ తరగతి బాలికను షేక్ జాన్ సైదా అలియాస్ రబ్బానీ అనే వ్యక్తి జూన్‌లో అపహరించి తీసుకెళితే, ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులకు మూడు నెలల సమయం ఎందుకు పట్టిందని హైకోర్టు సోమవారం రాష్ట్ర డీజీపీని ప్రశ్నించింది. ‘మైనర్ బాలికను కిడ్నాప్ చేయడం చాలా తీవ్రమైన విషయం. బాలిక కిడ్నాప్ వెనుక షేక్ జాన్ సైదా ఒక్కరే ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్ సమర్పించండి’ అని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ ఆలపాటి గిరిధర్ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
బాలిక కోరిక ప్రకారం
తండ్రికి అప్పగించాలని ఆదేశాలు..
అంతక్రితం జాన్ సైదా తీసుకెళ్లిన బాలికను గుంటూరు, పట్టాభిపురం పోలీసులు ధర్మాసనం ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆ బాలిక తన తండ్రితో పాటు ఇంటికెళతానని ధర్మాసనానికి తెలిపింది. దీంతో ధర్మాసనం ఆ బాలికను తండ్రికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక.. ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించే విషయంలో సహకరించాలని తండ్రికి ధర్మాసనం నిర్దేశించింది.
పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ ధర్మాసనం ముందు తొలుత వాదనలు వినిపిస్తూ బాలికను జాన్ సైదా అనే వ్యక్తి తీసుకెళ్లారని తెలిపారు. వారు హరియాణాలో ఉండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై పోక్సో, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు. జాన్‌సైదాకు సహకరించిన అతని తల్లి, సోదరిని ఈ కేసులో నిందితులుగా చేర్చామని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు.
పోలీసుల నిర్లక్ష్యంపై తండ్రి న్యాయ పోరాటం..
గుంటూరులో 10వ తరగతి చదువుతున్న తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదంటూ గుంటూరుకు చెందిన వ్యాపారి వాసు ఈ ఏడాది జూన్ 10న పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అదే రోజున మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన వాసు హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెను కోర్టు ముందు హాజరుపరిచి, ఆమెను తమకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం, పోలీసులపై ముఖ్యంగా డీజీపీపై నిప్పులు చెరిగింది. అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలుసుకుని తమ ముందు హాజరుపరిచేలా చూడాలని డీజీపీని ఆదేశించింది. దీంతో డీజీపీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
డీజీపీకి ధర్మాసనం ప్రశ్నలు..
⇒ బాలికను తీసుకెళ్లే వ్యవహారంలో జాన్ సైదాకు ఎవరు సహకరించారు?
⇒ గుంటూరు నుంచి వెళ్లిన తరువాత వీరికి ఎవరు ఆశ్రయం ఇచ్చారు?
⇒ బంధువులు, స్నేహితుల పాత్ర ఏమిటి?
⇒ నిందితుడు సైదాకు సహకరించిన వారిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు?
⇒ ఆ బాలిక మైనర్ అని తెలిసి హోటల్ యజమానులు ఎలాంటి ధ్రువపత్రాలు పరిశీలించకుండా గదులు ఎలా వారికి అద్దెకిచ్చారు?
⇒ వారిపై ఏమి చర్యలు తీసుకున్నారు?
⇒ అదృశ్యమైన రోజు నుంచి ఈరోజు వరకు పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?


