దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించండి
సీఐడీకి హైకోర్టు ఆదేశం
ఇది రూ.2,500 కోట్ల భారీ కుంభకోణం
ఇందులో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుది కీలక పాత్ర
ధర్మాసనం ముందు పొన్నవోలు వాదనలు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయన కంపెనీ ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కనుసన్నల్లో సాగిన వేల కోట్ల రూపాయల ‘ఈ–స్టాంప్’ కుంభకోణంపై నమోదైన కేసులో వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని హైకోర్టు సోమవారం సీఐడీని ఆదేశించింది. త్వరగా దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషిట్ దాఖలు చేయాలని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను స్టేటస్ రిపోర్ట్ రూపంలో తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది.
తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతక్రితం ఈ వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘ఇది రూ.2,500 కోట్ల కుంభకోణం.
ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేంద్రబాబుది కీలక పాత్ర’ అని కోర్టుకు విన్నవించారు. ఈ–స్టాంపుల కుంభకోణంపై సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, దర్యాప్తుపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండేందుకు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య గత ఏడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


