తప్పు మీది.. తిప్పలు మాకా? | AP Voters are expressing anger over Election Commission SIR | Sakshi
Sakshi News home page

తప్పు మీది.. తిప్పలు మాకా?

Sep 8 2026 5:16 AM | Updated on Sep 8 2026 5:22 AM

AP Voters are expressing anger over Election Commission SIR

రాష్ట్రంలో ఈసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు

2002 ఓటర్ల లిస్టుతో మ్యాపింగ్‌ అయినా నోటీసులు జారీ 

విచారణకు రాకపోతే ఓట్లు తొలగిస్తామంటూ బెదిరింపులు 

రేషనలైజేషన్‌ పేరుతో అడ్డగోలుగా పోలింగ్‌ బూత్‌లు మార్పిడి 

ఫాం 8తో ఓటర్ల కుటుంబాలు చెల్లాచెదురు.. 

అధికార పార్టికి అనుకూలంగా బూత్‌లు మార్చేస్తున్నారంటూ ఆరోపణలు 

‘సర్‌’ ముసాయిదా తర్వాత కూడా పలువురికి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు 

ఒక్క గాజువాకలోనే 2 రాష్ట్రాల్లో ఓట్లు కలిగిన వారు 300 మందికిపైనే 

అరకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అనుమానాస్పద ఓట్ల నమోదు 

అధికార పార్టీ కనుసన్నల్లో యంత్రాంగం ఎస్‌‘‘సర్‌’’

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. అధికారులు చేసిన తప్పులకు తమకు శిక్ష విధిస్తున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. మొక్కుబడిగా జరిగిన ఇంటింటి సర్వే తర్వాత 44.89 లక్షల మంది ఓటర్లను భారీగా తొలగించడమే కాకుండా మరో 44.21 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చి పోలింగ్‌ బూత్‌లు, గ్రామ సచివాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు. పట్టణాల్లో అద్దె ఇళ్లు మారిన వారిని పర్మినెంట్‌గా షిఫ్ట్‌ అయిపోయారంటూ ఏకంగా 22.30 లక్షల మంది ఓటర్లను తొలగించేశారు. సమీపంలోని ఇళ్లకు మారితే శాశ్వతంగా వెళ్లిపోయారంటూ ఓట్లను తొలగించేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ‘మీరు స్వయంగా గ్రామ సభకు హాజరై వివరణ ఇచ్చి సరైన ధృవీకరణ పత్రాలు అందచేసి ఫోటో దిగి వెళ్లాలి. లేదంటే మీ ఓటు తొలగిస్తాం..!’ అంటూ అధికారులు బెదిరించడంతో ఓటర్లు బెంబేలెత్తుతున్నారు. నోటీసులు అందుకున్న 44.21 లక్షల మందిలో అత్యధికులు ఇలాంటి సమస్యలే  ఎదుర్కొంటున్నారు. ‘మేం పొట్టకూటి కోసం వేరే ఊరిలో ఉంటున్నాం.. ఇప్పటికే ఒకసారి మ్యాపింగ్‌ కోసం వచ్చాం.. ఇప్పుడు నోటీసులు అంటూ రెండోసారి రావాలంటే డబ్బులు ఎక్కడి నుంచి పెట్టుకోవాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 ఏళ్ల నుంచి ఓటు వేస్తున్నాం.. 2002 ఓటర్ల లిస్టుతో మ్యాపింగ్‌ కూడా అయ్యింది.. కానీ ఇప్పుడు సర్‌ పేరిట ఈ వేధింపులు ఏమిటంటూ విజయవాడకు చెందిన వి.శ్రీనివాసరావు వాపోయాడు.  

అడ్డగోలుగా బూత్‌ల రేషనలైజేషన్‌.. 
పోలింగ్‌ బూత్‌ల రేషనలైజేషన్‌ పేరుతో ఓటర్లను చెల్లాచెదురు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి 1,200 మందికి ఒక పోలింగ్‌ బూత్‌ ఉండాలనే నిబంధన పేరుతో ఎన్నికల సంఘం బూత్‌లను అడ్డగోలుగా రేషనలైజేషన్‌ చేసిందనేందుకు అరకు శాసనసభ నియోజకవర్గం మచ్చుకు నిదర్శనం. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం పెదబయలు మండలం గబుడు పుట్టు గ్రామం పీఎస్‌ నంబర్‌ 77 చీకుపనసలో ఉండాల్సింది పోయి అక్కడకు 12 కిలోమీటర్లు దూరంలో ఉన్న పీఎస్‌ నెంబర్‌ 75 ఇంజరి గ్రామంలో కలిపారు. ఇదే ఇంజరి పంచాయతీలోని సుజరి గ్రామం ఓట్లు గతంలో పీఎస్‌ నెంబర్‌ 75 ఇంజరిలో ఉండేవి. ప్రస్తుతం గిన్నెగరువులో కలపడంతో అంత దూరం వెళ్లి ఓట్లు వేయలేమని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పంచాయతీ కుమ్మరిగుంట గ్రామం పీఎస్‌ నెంబర్‌ 77 చీకుపనసలో ఉండాల్సింది పోయి అక్కడకు దూరంగా పీఎస్‌ నెంబర్‌ 76 గిన్నెగరువులో విలీనం చేశారు. తల్లభు గ్రామం పీఎస్‌ నెంబర్‌ 76 గిన్నెగరువులో ఉండాల్సింది పోయి పీఎస్‌ నెంబర్‌ 75 ఇంజరిలో కలిపారు. అధికారపార్టీ ఒత్తిళ్లతో అడ్డగోలుగా పోలింగ్‌ బూత్‌లను మార్చేసి కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్‌ బూత్‌లో ఉండాలంటూ బలవంతంగా ఫారం 8 పెట్టించి మారుస్తున్నారు. ప్రతీ బీఎల్‌వోకు  ఫారం 8 టార్గెట్లు విధించి అమలు చేయిస్తున్నారంటే దీని వెనక అధికారపార్టీ ఎంత ఒత్తిడి తెస్తోందో అర్థం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఓటు.. 
సర్‌ ఇంటింటి సర్వే తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లు తొలగిపోతాయి.. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఉన్న ఓట్లలో ఏదో ఒకటే మిగులుతుందన్న భ్రమలు తొలగిపోతున్నాయి. 44.89 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత కూడా చాలా మంది రెండు రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క గాజువాక నియోజకవర్గానికి చెందిన 358 మందికి అటు తెలంగాణలోను ఇటు గాజువాకలోను ఓటు ఉన్నట్లు  గుర్తించి ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. గాజువాక నియోజకవర్గం 79వ వార్డు పాత అగనంపూడి ప్రాంతానికి చెందిన కట్టా స్వాతి తెలంగాణలోని కొల్లాపూర్‌లో నివాసముంటున్నారు. ఆమె గాజువాక నియోజకవర్గంలోను, తెలంగాణలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలోను ఓటు కలిగి ఉన్నారు. సర్‌ ప్రకారం ఎక్కడో ఒకచోటే ఓటు హక్కు కలిగి ఉండాలి. మిగిలినచోట ఎక్కడున్నా రద్దు చేసుకోవాలి. గాజువాకలో 79వ వార్డు బూత్‌ నంబర్‌ ఒకటిలో ఓటు హక్కు కలిగి ఉన్న ఆమె తెలంగాణ కొల్లాపూర్‌లో బూత్‌ నంబర్‌ 82లో కూడా ఓటు కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఏఈఆర్వో త్రినాథ్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆంధ్రప్రదేశ్‌లో రెండుచోట్ల ఓటు హక్కు ఉంటే తాము చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని, తెలంగాణలో రెండో ఓటు ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం మినహా తాము చర్య తీసుకునే అవకాశం లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ముఖ గుర్తింపు, వేలి ముద్రల ద్వారా దొంగఓట్లను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్‌తో లింక్‌ చేయకుండా సర్‌ పేరుతో మొక్కుబడిగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. 

దశాబ్దాలుగా నివసిస్తున్నా నోటీసు.. 
దశాబ్దాలుగా ఓటు వేస్తున్నా. మ్యాపింగ్‌ పేరుతో తండ్రి ఇంటి పేరులో చిన్న పొరపాటు ఉందంటూ నాకు నోటీసు జారీ చేశారు. ఈ నెల 11న ప్రత్యేక శిబిరం వద్ద విచారణకు రావాలని నోటీసులో పొందుపరిచారు. స్థానికంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నా. నా ఓటు తొలగిస్తే ఊరుకోను. 
–షేక్‌ అబ్దుల్‌ ఇస్మాయిల్, నాయుడుపేట 

బలవంతంగా ఫారం 8తో మార్చడం సరికాదు.. 
కొన్నిచోట్ల బలవంతంగా ఫారం 8 ఇచ్చి పోలింగ్‌ బూత్‌లను మార్చడం సరికాదు. ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఒక కుటుంబంలోని వారు పలు ప్రాంతాల్లో ఉంటారు. వారంతా ఒకే పోలింగ్‌ బూత్‌లోకి రావాలనే నిబంధన కరెక్ట్‌ కాదు. ఆయా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు మాత్రమే పోలింగ్‌ బూత్‌లను మార్చాలి. 
– గూడూరు రఫీ, నాగూరుకాలనీ, తిరుపతి రూరల్‌ 

ఓటమి భయంతో ఓట్ల తొలగింపు..                                
ప్రజాదరణ లేని టీడీపీ ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. సర్‌ ప్రక్రియలో పొన్నూరు మండలం మన్నవలో టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేసి ఓట్లను తొలగించే పనిలో పడ్డారు. వైఎస్సార్‌ సీపీ ఓట్లే లక్ష్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికే 300కు పైగా ఓట్లు తొలగించారు. జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారి ఓట్లను కూడా తీసేస్తున్నారు.  
– బొనిగల వేణు ప్రసాద్‌. మాజీ పొన్నూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌       

ప్రజాదరణ కోల్పోయి అడ్డదారులు               
దశాబ్దాలుగా మాది రాజకీయ కుటుంబం. సర్పంచులు, ఎంపీటీసీలుగా మా కుటుంబీకులు పనిచేశారు. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ నాయకులు  ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నారు. అధికారులు వారికి సహకరిస్తున్నారు. మూడుసార్లు గ్రామ సర్పంచిగా చేసిన నా ఓటు తొలగించడం ఏమిటని ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదు. మా తమ్ముడి భార్య ఓటు కూడా తొలగించారు. ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ అడ్డదారుల్లో గెలిచేందుకు కార్యాచరణ రూపొందించింది.  
– బొనిగల నాగమల్లేశ్వరరావు, మాజీ సర్పంచి, మన్నవ గ్రామం, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా                

అరకులో అనుమానాస్పద ఓట్ల నమోదు 
అరకులోయ మండలం బూత్‌ నంబర్‌  213 నుండి 271 వరకు, 107 నుంచి 163 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వందల సంఖ్యలో అనుమానాస్పదంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. ఒకే ఫోటోతో రెండు ఓట్లు.. చనిపోయిన వారి ఓట్లు ఇంకా జాబితాలో ఉండటం.. ఒకే వ్యక్తి పేరుతో రెండు బూత్‌లలో ఓట్లు ఉండటం లాంటి తప్పిదాలు జరిగాయి. దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేసి వంద శాతం పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి. 
– ఆర్‌.మత్స్యలింగం, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే, అరకు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement