సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ చుట్టూ మాటల యుద్ధం ముదురుతోంది. ఓ వైపు ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
రాంగోపాల్‌పేట్ డివిజన్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్‌ఐఆర్, విద్యావ్యవస్థపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్‌ఐఆర్ ద్వారా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారని రాంచందర్‌రావు అన్నారు. అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేరళలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఎస్‌ఐఆర్ కారణంగానే బీజేపీ గెలుస్తుందన్న కాంగ్రెస్ వాదనలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆ ఓటమికి ముందుగానే ఎస్‌ఐఆర్‌ను కారణంగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి, మజ్లిస్‌కు కాంగ్రెస్ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్‌ఐఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు.
విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తి
రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితిపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. టీచర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ముందుగా విద్యావ్యవస్థను చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడం ప్రభుత్వం వల్ల కాకపోతే.. ఆ శాఖను వేరే వారికి అప్పగించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాల్లోనూ పోరాడతామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం!


