కోనసీమ జిల్లా అమలాపురంలో సాగు సమ్మె తీర్మానానికి మద్దతు తెలుపుతున్న ఆక్వా రైతులు
తమ డిమాండ్లను 30లోపు పరిష్కరించాలి
ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన రైతులు
అక్టోబర్ 1 నుంచి ఫీడ్ కంపెనీలకు చెందిన మందుల కొనుగోళ్లు బంద్.. అమలాపురంలో రాష్ట్రస్థాయి ‘ఆక్వా రైతు బతుకు పోరాట సదస్సు’
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మేలు చేసిందన్న సంఘం నాయకులు
సాక్షి, అమలాపురం: పెంచిన రొయ్యల మేత ధరలను తగ్గించడంతో పాటు ఇతర డిమాండ్లను ఈ నెల 30వ తేదీలోగా పరిష్కరించని పక్షంలో ‘సాగు సమ్మె’కు కూడా వెనుకాడబోమని ఆక్వా రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మేత కంపెనీలు తయారు చేసే మందులను కొనుగోలు చేయడం నిలిపివేస్తామని హెచ్చరించారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్‌రాజు అధ్యక్షతన సోమవారం రాష్ట్రస్థాయి ‘ఆక్వా రైతు బతుకు పోరాట సదస్సు’ నిర్వహించారు. తొలుత వై.జంక్షన్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల రైతులు తరలివచ్చారు. కోనసీమ జిల్లాకు చెందిన అగ్నికుల క్షత్రియ సంఘం, కారి్మక సంఘ నాయకులు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. సదస్సులో ఆక్వా రైతులు మాట్లాడుతూ ఫీడ్ ధరల పెంపునకు కనీసం 40 రోజుల వ్యవధి ఉండాలని, రొయ్య ధరలు మార్పులు చేసేందుకు 15 రోజుల గడువు ఉండాలనే నిబంధన ఉన్నా కంపెనీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలో ఫీడ్ ధర టన్నుకు రూ.12 వేల వరకు పెంచడంపై మండిపడ్డారు.
తీర్మానాలు ఇవీ..
పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలి. గ్రాముకు రూ.10 చొప్పున ధరల స్థిరీకరణ విధానం అమలు చేయాలి. నాణ్యమైన సీడ్ సరఫరా చేయాలి. ఫీడ్ కంపెనీలకు చెందిన మందుల విక్రయాలను నియంత్రించాలి. కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. ఏటా మే నుంచి ఆగస్టు వరకు స్వచ్ఛంద పంట విరామం ప్రకటిస్తే నష్టాలు, కష్టాలు తగ్గుతాయని రైతు సంఘం ప్రతినిధులు తేల్చిచెప్పారు.
అప్సడా చట్టం వల్ల చాలా మేలు జరిగింది
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం తీసుకు రావడం వల్ల ఆక్వా రైతులకు చాలా మేలు జరిగిందని ఆక్వా రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటే కష్టాలు కొన్ని అయినా తీరుతాయన్నారు. రైతు సంఘం ప్రతినిధులు త్సవటపల్లి నాగభూషణం, యాళ్ల వెంకటానందం, కేఎస్‌ఎన్ రాజు, రుద్రరాజు నానీరాజు, సత్తిబాబు రాజు, వినాయక, రఘు, కె.కృష్ణశ్రీ, యశ్వంత్ కుమార్ పాల్గొన్నారు.


