రాజధాని కోసం అవసరానికి మించి నాలుగు రెట్ల భూసమీకరణ
మరో 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కంతేరులో 974, తాడికొండలో 5,238.50 ఎకరాలు
రైల్వే లైన్, ఐఆర్‌ఆర్, గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం వినియోగం
ఇందుకు 1,581.34 ఎకరాలు సరిపోతాయని అంచనా
దీనికి భిన్నంగా ప్రభుత్వం అనుమతులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూసమీకరణ పథకం (ఎల్పీఎస్) కింద గుంటూరు జిల్లాలో కంతేరులో 974, తాడికొండలో 5,238.50 ఎకరాల సమీకరణకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రైల్వే లైన్, ఐఆర్‌ఆర్, గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం ఈ భూ సమీకరణ చేయనున్నారు. ఎర్రుపాలెం–నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ నిర్మాణం (ఇరు వైపులా 50 మీటర్లు బఫర్ జోన్), ఇంటర్నల్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్), గ్రిడ్ రోడ్‌ను ఐఆర్‌ఆర్ వరకూ విస్తరించే పనులకు కంతేరు, తాడికొండలో భూసమీకరణకు ఆగస్టు 28న సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది. అయితే ఇందుకు 1,581.34 ఎకరాలు సరిపోతుందని అంచనావేస్తుండగా, దీనికి భిన్నంగా 6,212.50 ఎకరాల సమీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం గమనార్హం.
సమీకరణల తీరిది..
⇒ కంతేరులో పట్టా భూమి (దేవాదాయ.. వక్ఫ్ భూమితోపాటు) 3,299.66 ఎకరాలు, అటవీ–ప్రభుత్వ భూమి 304.78 ఎకరాలు, అసైన్డు భూమి 67.97 ఎకరాలు మొత్తం 3,672.41 ఎకరాలు ఉంది. అయితే రైల్వే లైన్ కోసం 148.30, ఐఆర్‌ఆర్ కోసం 58.03, ఐఆర్‌ఆర్ వరకూ గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం 35.65 మొత్తం 241.98 ఎకరాలు అవసరం కాగా.. 974 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది.
⇒ తాడికొండలో పట్టా భూమి(దేవాదాయ.. వక్ఫ్ భూమితోపాటు) 11,216.12 ఎకరాలు, అటవీ–ప్రభుత్వ భూమి 1,445.47 ఎకరాలు, అసైన్డు భూమి 135 ఎకరాలు మొత్తం 12,796.59 ఎకరాలు ఉంది. ఇక్కడ రైల్వే లైన్ కోసం 701.26, ఐఆర్‌ఆర్ కోసం 167.79, ఐఆర్‌ఆర్ వరకూ గ్రిడ్ రోడ్ విస్తరణ కోసం 470.31 మొత్తం 1,339.36 ఎకరాలు అవసరం కాగా.. 5,238.50 ఎకరాలను సమీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది.


