జల వివాదాలపై చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు
ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకున్నాక అజెండా ఖరారు
ఆ తర్వాత రెండు వారాల్లో మరోమారు సమావేశం
కృష్ణా, గోదావరి జల వివాదాల కమిటీ భేటీలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెల్లడి
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో భేటీలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు.
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో ఆంధ్రపద్రేశ్, తెలంగాణల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి సూచనలు ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీ రెండో సమావేశంలోనూ అజెండాపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారంలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ సూచించారు. ఏపీ ప్రతిపాదనలను తెలంగాణకు, తెలంగాణ ప్రతిపాదనలను ఏపీకి పంపుతామని.. వాటిని పరిశీలించి ఇరు రాష్ట్రాల అధికారులు అభిప్రాయాలు చెప్పాక అజెండాను ఖరారుచేసి మరో రెండు వారాల తర్వాత సమావేశం నిర్వహిస్తామంటూ చేసిన సూచనకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు.
సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జల వివాదాల కమిటీ రెండో సమావేశం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి.. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. గత జనవరి 30న జరిగిన తొలి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ఆ సమావేశంలో అజెండా సమరి్పంచాలని ఇరు రాష్ట్రాల అధికారులను సీడబ్ల్యూసీ చైర్మన్ కోరినా ఇప్పటిదాకా అజెండాను రెండు రాష్ట్రాలు ప్రతిపాదించలేదు. దీంతో అజెండాను ఖరారు చేసేందుకు రెండో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి, గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం, గోదావరి జలాల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేల్చడం, కృష్ణాపై అనుమతిలేకుండా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించాలని ఏపీ అధికారులు సూచించగా.. బ్రిజేష్‌కుఆర్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా వినియోగించుకునే అవకాశం కల్పించడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి హక్కులను కల్పించడం, గోదావరి మిగులు జలాల వినియోగం, పోలవరం–నల్లమలసాగర్ లింక్, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు వంటి అంశాలపై చర్చించాలని తెలంగాణ అధికారులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
లభ్యత జలాల లెక్కలపై ఏపీ అభ్యంతరాలు..
గోదావరిలో ప్రవాహాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి నీటి లభ్యతను తేల్చాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఏపీ అధికారులు కోరారు. నీటి లభ్యత తేల్చాక ఏపీ, తెలంగాణ వాటాలను తేల్చాలన్నారు. గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేసి రెండు రాష్ట్రాల వాటాలను తేల్చాలని తమ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసిందని వారు గుర్తుచేశారు. నీటి వాటాలు తేలకముందే తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల వంటి ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఆ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని.. రీ–ఇంజినీరింగ్, డిజైన్ చేసి చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశామని వివరించారు. ప్రస్తుత సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 65 రోజుల్లో వెయ్యి టీఎంసీలకు పైగా వరద జలాలు సముద్రంలో కలిశాయని.. అందులో 200 టీఎంసీలను వినియోగించుకోవడానికి చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతివ్వాలని ఏపీ అధికారులు కోరగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ అజెండాలో చేర్చితే వాటిపై చర్చిద్దామని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.
మాకు తాగునీరు, విద్యుత్ అవసరాలే ముఖ్యం : తెలంగాణ
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టును ఖాళీచేస్తోందని.. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందించలేని.. రాయలసీమ, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయలేమని ఏపీ అధికారులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు వివరించారు. విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను నిలువరించాలని ఏపీ అధికారులు కోరడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
అయితే, తమకు తాగునీరు, విద్యుత్ అవసరాలే అత్యంత ముఖ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ అధికారులు వివరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్‌లో తగిన నిల్వలు అవసరమని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ తన వాటాకు మించి నీళ్లను తరలిస్తోందన్నారు. వీటిపై సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.
గోదావరి–కావేరి బ్లూప్రింట్ మేమే రూపొందిస్తాం : సీడబ్ల్యూసీ
ఇక తెలంగాణలోని సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుండగా.. పోలవరం ప్రాజెక్టు నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పోలవరం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలిస్తే తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు బ్లూప్రింట్ తామే రూపొందిస్తామని సీడబ్ల్యూ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ స్పష్టంచేశారు.


