స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు 4 కోట్ల రాష్ట్ర ప్రజలకు అవమానం
ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడిని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలి: శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి
22ఏపై చర్చకు పట్టుబట్టిన బీజేపీ.. స్పీకర్‌కు జరిగిన అవమానంపై చర్చ ముఖ్యమన్న అధికార పక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే ఇది చీకటి రోజని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అవమానకర వ్యాఖ్యలు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు సోమవారం తీవ్ర దుమారం రేపాయి. భోజన విరామం తర్వాత శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. తాతా మధు వ్యాఖ్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిపాదించారు. అప్పటికే బీజేపీ సభ్యులు 22ఏ పై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్లకార్డులతో బైఠాయించారు. బీఏసీలో చర్చ తర్వాత ఈ అంశాన్ని చేపడదామని, స్పీకర్‌కు జరిగిన అవమానంపై చర్చ అత్యంత ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు.
బీఆర్‌ఎస్‌ను కాపాడుతున్నారనే అనుమానం కలిగించొద్దు
‘స్పీకర్ పదవి అంత అత్యున్నతమైనది. అన్ని పార్టీల మద్దతుతో ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తిని గౌరవించడం అందరి బాధ్యత. సభలో సీఎం అయినా, శాసనసభ్యుడైనా సభాపతికి ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటి స్పీకర్ మనసు ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యల వల్ల గాయపడింది. దీన్ని గడ్డం ప్రసాద్‌కుమార్‌కు జరిగిన అవమానంగానే చూడకూడదు. యావత్ తెలంగాణ సిగ్గుపడే ఘటన ఇది. మనుషులు ప్రయోగించలేని, సభ్య సమాజం సహించలేని భాష వాడి, అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఇంతకన్నా చర్చనీయాంశం మరొకటి ఉండదని బీజేపీ గుర్తించాలి. చర్చలో పాల్గొనకుండా బీఆర్‌ఎస్ దుర్మార్గాలను కాపాడుతున్నారనే అనుమానం ప్రజలకు కలిగేలా వ్యవహరించవద్దు.
ఫాంహౌస్ నుంచి సభ్యులను పురిగొల్పారు..
అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు బీఆర్‌ఎస్ నాయకుడు ఫాంహౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసి తన సభ్యును పురిగొల్పారు. పోలీసులపై దాడి చేసి, సభాపతిని దూషించడమంటే క్షమించరాని నేరం. ఇది అనాలోచిత చర్య కాదు.. తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతితో పాటు కుటుంబ సభ్యులను అవమానించారు. బీఆర్‌ఎస్ పుట్టినప్పుడు, విజయం సాధించినప్పుడు దళితులనే ఆయుధంగా వాడారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తానని, దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని నమ్మించి, దళిత బంధు ఇస్తానని నమ్మించిన పార్టీ బీఆర్‌ఎస్. అధికారంలోకి వచ్చాక దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. ఆ పార్టీది దళిత వ్యతిరేక ఆలోచన.
తల్లిని దూషిస్తే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది
ఇలాంటి సంఘటన స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇలాంటి పోకడలను నియంత్రించకపోతే రాబోయే తరాలు ఈ సభను కూడా క్షమించవు. తల్లిని అవమానించే విధంగా మాట్లాడితే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది. ఇలాంటి చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉంది. విశృంఖలత్వం, అడ్డగోలుతనం, ఏం మాట్లాడినా చెల్లుతుందనే అహంకారం, ఏం చేసినా చూసుకోవడానికి ఫాం హౌస్‌లో తమ నాయకుడు ఉన్నాడనుకునే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమించి ఊరుకుంటే చట్టసభలకు విలువ ఉండదు. దీనిపై చర్చించి స్వయం నియంత్రణ విధానం తేవాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు.


