ఆటో ఛార్జీలు పెరగనున్నాయా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన | Telangana Auto Drivers Fare Hike Welfare Board Special App | Sakshi
Sakshi News home page

ఆటో ఛార్జీలు పెరగనున్నాయా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

Telangana Auto Drivers Fare Hike Welfare Board Special App

తెలంగాణ: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆటో ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌, పర్మిట్ల సమస్యలు, బీమా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకట్‌ స్వామి ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

ఆటో కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చ
ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో ప్రస్తావించిన సమస్యలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు. సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

2012 తర్వాత పెరగని ఆటో ఛార్జీలు
ఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 2012 తర్వాత ఛార్జీలు పెరగలేదని, ప్రస్తుతం పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఛార్జీలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఛార్జీలు ఎంత మేర పెంచాలన్న అంశాన్ని పరిశీలించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ఛార్జీల పెంపును అమలు చేసే అవకాశం ఉంది.

ఆర్టీసీ ఈవీ ఆటోలపై దుష్ప్రచారమే
టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

ఓలా, ఉబెర్‌ తరహాలో ప్రభుత్వ ప్రత్యేక యాప్‌
ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్‌ను తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయి. ఓలా, ఉబెర్‌, ర్యాపిడో తరహాలో పనిచేసే యాప్‌ రూపకల్పనపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకోనుంది. ఈ ప్రతిపాదనను కేబినెట్‌లో చర్చించిన అనంతరం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రులు తెలిపారు. బోర్డు ద్వారా ఆటో కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.

పెండింగ్‌ పర్మిట్లకు పరిష్కారం
జీఓ ఎంఎస్‌ నంబర్‌ 263 కింద తిరస్కరించబడిన కేసులతో పాటు గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న ఆటో రిక్షా పర్మిట్ల కోటాను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

అగ్రిగేటర్‌ పాలసీపై ప్రత్యేక అధ్యయనం
అగ్రిగేటర్ల ద్వారా వైట్‌ ప్లేట్‌ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రం ప్రకటించిన అగ్రిగేటర్‌ పాలసీలో ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించే అవకాశం ఉన్నందున దీనిపై రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అగ్రిగేటర్‌ పాలసీపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావాన్ని పరిశీలించనున్నారు.

ఇతర జిల్లాల ఆటోలపై నిబంధనలు కఠినం
ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్‌ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆటో సంఘాల ప్రతినిధులు కోరారు. దీనిపై రవాణా శాఖ స్పందిస్తూ నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నిబంధనల అమలులో నగరంలోని ఆటో కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.

సారథి పోర్టల్‌ సమస్యకు పరిష్కారం
ఆటో రిక్షా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కేటగిరీ విషయంలో సారథి పోర్టల్‌లో స్పష్టత లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎల్‌ఎంవీ లైసెన్స్‌ ఉన్నవారు ఆటో నడిపే విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి స్పష్టత కోరనున్నట్లు తెలిపారు.

18,700 ఆటోలకు రూ.1.50 లక్షల సాయం
హైదరాబాద్‌లో డీజిల్‌, పెట్రోల్‌ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు రెట్రోఫిట్మెంట్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని సుమారు 18,700 ఆటోలకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా పాలసీ
ఆటో డ్రైవర్ల ప్రమాదాలు, సహజ మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పథకాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశంపై కార్మిక శాఖతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ పాలసీ’ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయం
ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఆటో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్‌ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్‌ కమిషనర్‌ రమేష్‌, జేటీసీలు చంద్రశేఖర్‌ గౌడ్‌, శివలింగయ్య, వెంకట రమణతో పాటు కార్మిక శాఖ, పోలీస్‌, ట్రాఫిక్‌ శాఖల అధికారులు, వివిధ ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement