సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ తీరును, పోలీసుల జోక్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
అసెంబ్లీకి వెళ్తున్న వారిని పోలీసులు ఎలా అడ్డుకుంటారు? అసెంబ్లీ అనేది స్పీకర్ పరిధిలోకి వస్తుంది, అక్కడ పోలీసులకు ఏం పని? అని హైకోర్టు తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. నిరసన సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ పూర్తి ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తం అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.


