బీఆర్‌ఎస్‌ ప్లాన్‌కు రేవంత్‌ ట్విస్ట్‌! | Telangana Assembly Sessions: Revanth Turns BRS's Weapons Against It | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ప్లాన్‌కు రేవంత్‌ ట్విస్ట్‌!

Sep 7 2026 9:36 AM | Updated on Sep 7 2026 9:52 AM

Telangana Assembly Sessions: Revanth Turns BRS's Weapons Against It

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. అయితే ప్రతిపక్షం దూకుడును ముందే పసిగట్టిన రేవంత్‌ ప్రభుత్వం కౌంటర్‌కు దిగింది.

22ఏ భూముల వ్యవహారంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలపైనా చర్చించాలని సీఎం రేవంత్‌ నిర్ణయించినట్లు సమాచారం.  బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరఫున ఈ అంశాలపై చర్చకు ప్రతిపాదనను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పెట్టనున్నారు. సమావేశంలో చర్చించి వీటిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ లేవనెత్తాలనుకున్న అంశాలనే అధికార పక్షం చర్చకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.

22ఏపై ఇప్పటికే రగడ
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం కొంతకాలంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ డిమాండ్‌ చేస్తున్నాయి. 22ఏ జాబితాలో భూములు చేరడంలో అధికారుల తప్పిదాలపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ సాధ్యం కాని కేసుల్లో అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా ఫోకస్‌
మరోవైపు పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను బీఆర్‌ఎస్‌ ప్రధానంగా ప్రస్తావించనుంది. విద్యార్థులు, కళాశాలల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైనా చర్చకు సిద్ధమని చెబుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో నిధుల విడుదలపై హామీలు ఇచ్చారు. ఆగస్టులో ప్రభుత్వం రూ.2,400 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.

నల్ల టీషర్ట్‌లతో బీఆర్‌ఎస్‌ నిరసన
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్‌లతో నిరసనకు సిద్ధమయ్యారు. 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు రైతులు, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలనూ సభలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది.

మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రధానంగా నిలదీయాలనుకుంటున్న 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలపైనే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుండటం ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.

నేడు అసలు సమరం!
సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్‌ హాల్‌ను సీఎం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వివిధ నివేదికలను సభ ముందుంచనున్నారు.

ఇదీ చదవండి: ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement