సాక్షి, హైదరాబాద్: ఇప్పుడే చేరుకున్నామంటూ సమాచారం ఇచ్చినవారు కొందరు.. ఇందాకే బయలుదేరామంటూ కబురందించినవారు ఇంకొందరు.. ఇంకాసేపట్లో గమ్యం చేరుకుంటామనే మాటచెప్పిన వారు మరికొందరు.. ఆ కొద్దిసేపటికే వారంతా అదృశ్యమయ్యారు. అప్పటి వరకు మాట్లాడిన, సంబంధాలు కలిగి ఉన్నవారు ఆకస్మిక జల ప్రళయంలో నగరానికి చెందిన సుమారు 15 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం.
గత నెల 26న నేపాల్‌లో హఠాత్ వరదల్లో ఆచూకీ లేకుండాపోయినవారి కుటుంబీకుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇంకా కొన్ని ప్రయత్నాల అనంతరం అదృశ్యమైన వారి స్థితి ఇదంటూ అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం తమవారు బతికున్నారని.. ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఆ జ్ఞాపకాల్లో కుటుంబాలు..
నగరానికి చెందిన నేపాల్ వరద బాధిత కుటుంబాల్లో ఎవరిని పలకరించినా అదృశ్యమైన వారి జ్ఞాపకాలే వెంటాడుతున్నాయని చెబుతున్నారు. తమవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే రోజులు గడిచిపోతున్నాయని చెబుతున్నారు. విహార/తీర్థ యాత్ర తమకు ఇంతటి విషాదాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని కన్నీంటి పర్యంతమవుతున్నారు. కొందరు కుటుంబీకులు తమ వారి కోసం నేపాల్ వరకు వెళ్లి ఎంతో ఆశతో గాలించి నిరాశతో తిరిగి వచ్చారు. ఆ వరదల్లో తప్పిపోయిన వాళ్లల్లో కొందరు ఇటీవలే వచ్చినట్లు వివిధ రాష్ట్రాల నుంచి వార్తలు వస్తున్నాయని, తమ వాళ్లు కూడా అలానే మృత్యుంజయులు కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆ చిరునవ్వుల కోసం..
నాగోలు: నేపాల్ వరదల్లో గల్లంతైన ఎల్‌బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసినీ రెడ్డి (44) ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. భారత రాయబార కార్యాలయం అధికారులు ఆమె జాడను కనుగొనాలని తల్లిదండ్రులు మహేందర్‌రెడ్డి, ప్రేమలతా రెడ్డి కోరుతున్నారు.
ఆ్రస్టేలియాలో ఉన్న భర్త సంజీవరెడ్డి, పెద్ద కుమారుడు భారత్‌కు వచ్చి అనంతరం నేపాల్ వెళ్లారు. భారత రాయబార అధికారులతో మాట్లాడి సుహాసిని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి భారత్‌కు చేరుకున్నారు. సుహాసిని సమాచారం ఇప్పటికీ తెలియకపోవడంతో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


