హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక స్టార్ హోటల్ పబ్‌లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ సోదరుడు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్‌లోని ఎనిమిదో అంతస్థులో ‘కారా కారా’ పేరుతో పబ్ ఉంది. శనివారం రాత్రి దాదాపు 2.10 గంటల ప్రాంతంలో పబ్‌లో దాదాపు 200 మందికిపైగా ఉన్నారు.
అదే సమయంలో పబ్‌లో గోడకు, టేబుల్‌కు మధ్యలో ఉన్న అనిల్ కుమార్‌యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ (టిల్లు)ను దాటుకొని వెళ్లడానికి మరో యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న అరవింద్ యాదవ్ స్నేహితులు యువకుడిపై దాడికి దిగారు. ఇది గమనించిన యువకుడి స్నేహితులు సైతం ఒక్కసారిగా రెచ్చిపోయి అరవింద్‌తోపాటు అతని స్నేహితులపై ఎదురుదాడికి దిగారు.
దీంతో పబ్‌లో రణరంగం చోటచేసుకొంది. బీరు సీసాలతో చేతులు, కాళ్లతో దాడికి దిగబడటంతో చుట్టు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకొంది. ఈ గొడవలో ఒక యువతి కింద పడిపోయింది. అదే సమయంలో పబ్‌లోని బౌన్సర్లు వచ్చి ఇరువర్గాలను అడ్డుకొని అక్కడి నుంచి కిందకు పంపారు. వీరంతా హోటల్ సెల్లార్‌లోకి చేరుకుని అక్కడా ఘర్షణకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్ నిర్వాహకులతోపాటు అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఇరువర్గాలు పరారయ్యారు.
విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్‌లో అద్దాలు పగిలి ఉండటంతోపాటు, బల్లలు, కురీ్చలు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో అరవింద్ యాదవ్ టోపీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌ఐ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పబ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని విచారిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమయానికి మించి పబ్‌ను నడపడంతో మరో కేసు సైతం సుమోటోగా నమోదు చేశారు.


