బైక్ ట్యాక్సీల విషయంలో పూర్తి విరుద్ధ నిర్ణయం
ఆటోవాలాల ఒత్తిడితో వాటిని నియంత్రించే దిశగా చర్యలు
ఎల్లో కమర్షియల్ ప్లేట్ ఉంటేనే ట్యాక్సీగా తిరిగేందుకు అనుమతి!
ఎల్లో ప్లేట్‌గా మార్చుకోవాలంటే వాణిజ్య చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి
ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 18 వేలకు పైగా బైక్ ట్యాక్సీలు మాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలకు కళ్లెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యానికి కారణమవుతోంది. ఒకవైపు యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు టూవీలర్లను కూడా ట్యాక్సీలుగా తిప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వా లని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంతకాలం యాప్ ఆధారిత అగ్రిగేటర్ల అదీనంలో వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు ట్యాక్సీలుగా తిరుగుతున్నాయి. ఇప్పుడు అలా తిరిగేందుకు వీలు లేకుండా, పసుపు రంగు (ఎల్లో) నంబర్ ప్లేట్‌తో వాణిజ్య వాహనాలుగా నమోదు చేసుకుంటేనే ట్యాక్సీగా నడిపేందుకు అనుమతించేలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. ఆటో వాలాల ఒత్తిడితోనే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.
ఆటోవాలాల ఒత్తిడితో..
మీటర్లను అలంకారప్రాయంగా మార్చి ఎడాపెడా చార్జీలు డిమాండ్ చేస్తారనే ఆరోపణలు ఆటోవాలాలపై ఉన్నాయి. కాగా కొంతకాలంగా వీరు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. పుష్కరకాలంగా కొనసాగుతున్న పాత చార్జీలను పెంచాలన్న డిమాండ్‌తో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇతర ఆర్థిక సహకారాల కోసం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సానుకూలత వ్యక్తం చేసిన ప్రభుత్వం చార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రిట్రోఫిట్మెంట్ ద్వారా డీజిల్ ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు ఏర్పాటు చేసుకుంటే రూ.లక్షన్నర ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించింది. అయితే నగరంలో పెద్ద సంఖ్యలో తిరుగుతూ ప్రయాణికులకు చేరువైన బైక్ ట్యాక్సీలను నియంత్రించాలన్న డిమాండ్‌పై ఆటో యూనియన్లు పట్టుపట్టాయి. ఎల్లో నంబర్ ప్లేట్‌తో ఉండే వాణిజ్య వాహనాలనే ట్యాక్సీలుగా అనుమతించాలని, సాధారణంగా వైట్ ప్లేట్‌తో ఉండే బైక్‌లను ట్యాక్సీలుగా కొనసాగించరాదని కోరారు. ఈ డిమాండ్‌తో సమ్మె చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
గడ్కరీ ఏమన్నారు..
‘దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సరళమైన విధానాలతో వ్యవహరించాలి. సొంత ద్విచక్రవాహనాలను బైక్ ట్యాక్సీలుగా వినియోగించుకోవటం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది కొత్తగా ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇవి ప్రయాణికులకు తక్కువ చార్జీలకే అందుబాటులో ఉంటాయి. రవాణా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఆ«దీనంలోని అంశం అయినందున, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల నిర్ణయం తీసుకోవాలి..’అని గడ్కరీ విజ్ఞప్తి చేశారు.
బైక్ ట్యాక్సీలకు పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుతం రాష్ట్రంలో 18,314 బైక్‌లను ట్యాక్సీలుగా వాడుతూ యువత ఉపాధి పొందుతోంది. నిజానికి రాష్ట్ర రవాణా శాఖ ఎల్లో ప్లేట్ నిబంధనను గతంలోనే పొందుపరిచింది. కానీ ఉబర్, ర్యాపిడో, ఓలా లాంటి యాప్ ఆధారిత అగ్రిగేటర్ల ద్వారా తెలుపు ప్లేట్‌తో కూడిన సాధారణ ద్విచక్రవాహనాలను కూడా ట్యాక్సీలుగా వాడుతున్నారు. ఒకరు, వేగంగా ప్రయాణించడానికి వీలైన ఈ ట్యాక్సీలకు నగరంలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆటోవాలాల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో ప్లేట్ నిబంధనను కఠినంగా అమలులోకి తెస్తే, ఈ బైక్ ట్యాక్సీలన్నీ దాదాపుగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడనుంది.
‘ఎల్లో’పెను భారం..
సాధారణ బైక్‌ను వాణిజ్య వాహనంగా మార్చుకోవాలంటే పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. కన్వర్షన్ చార్జీలు రూ.3 వేలతో ముగిసినా.. తర్వాత క్రమం తప్పకుండా పన్నులు, రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ రోడ్ ట్యాక్స్, త్రైమాసిక పన్ను, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ ఫీజు, గ్రీన్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు.. ఇలా చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇక ఒకసారి వాణిజ్య వాహనంగా మారిన తర్వాత దాన్ని సొంత వాహనంగా వినియోగించుకోవటం కూడా ఇబ్బందే. అది నిబంధనలకు విరుద్ధమైనందున దానికి పెనాల్టీ చెల్లించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా యువత బైక్ ట్యాక్సీలను విడిచిపెట్టే అవకాశం ఉంది.
ప్రయాణికులకు చార్జీల పోటు
నగరంలో క్యాబ్, ఆటోల చార్జీలు భారీగా ఉంటున్నాయి. యాప్ అల్గారిథమ్ రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని చార్జీలను పెంచి వడ్డిస్తోంది. వాటితో పోలిస్తే బైక్ ట్యాక్సీ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలామంది వీటిని వాడుతున్నారు. ఇక చిన్నచిన్న పార్శిళ్ల తరలింపునకు కూడా వీటిని వాడటం అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ బైక్ ట్యాక్సీలు దూరమైతే, ఆ మేరకు ప్రయాణికుల జేబుకు కూడా చిల్లు పడుతుంది.


