30 జిల్లాల్లో పాతాళానికి గంగ | El Nino Effect: ground water has fallen during rainy season | Sakshi
Sakshi News home page

30 జిల్లాల్లో పాతాళానికి గంగ

Sep 7 2026 3:26 AM | Updated on Sep 7 2026 3:26 AM

El Nino Effect: ground water has fallen during rainy season

ఆగస్టులో 7.87 మీటర్ల సగటు లోతులో భూగర్భ జలాల లభ్యత

2025 ఆగస్టుతో పోల్చితే 2.09 మీటర్ల పతనం 

అప్పట్లో 5.78 మీటర్ల లోతుల్లోనే లభ్యత 

మేడ్చల్‌– మల్కాజిగిరిలో 12.12 మీటర్లలో లోతుల్లో లభ్యత 

ఎల్‌నినో ప్రభావంతో వర్షాకాలంలోనే పతనమైన భూగర్భ జలాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భజలాలు ఆందోళనకర రీతిలో పడిపోయాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టాలు పాతాళానికి చేరాయి. రాష్ట్ర భూగర్భ జలశాఖ 2026 ఆగస్టు మాస రెండో పక్షం నివేదిక ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో సగటున 2.09 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయినట్టు వెల్లడైంది. ఈ ఆగస్టు(2026)లో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 7.87 మీటర్లు ఉండగా, గతేడాది (2025) ఇదే సమయానికి ఇది 5.78 మీటర్లు మాత్రమే ఉంది. అంటే సగటున 2.09 మీటర్లు నీటి మట్టం పడిపోయింది. జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రంలో 574 మి.మీల సాధారణ వర్షపాతం ఉండాల్సి ఉండగా, 474 మి.మీ మాత్రమే కురిసింది. ఇది 17% లోటు వర్షపాతాన్ని సూచిస్తుంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 3.48 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండగా, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 12.12 మీటర్ల లోతులకు పడిపోయాయి. భూగర్భ జలశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,771 పీజో మీటర్ల ద్వారా నమోదు చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో మారుతున్న భూగర్భజల స్థితిగతులు స్పష్టమవుతున్నాయి. 

రాష్ట్రంలో 33 జిల్లాలుండగా, 17 జిల్లాల్లో 21–45 శాతం వరకు తీవ్రమైన వర్షపాత లోటు నమోదైంది. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలోని 30 జిల్లాల్లో భూగర్భ జలాల నీటిమట్టాలు పడిపోయాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 5.76 మీ., సూర్యాపేటలో 5.35 మీ., వికారాబాద్‌ జిల్లాలో 5.16 మీ.ల మేర భారీ పతనం నమోదైంది. రెండు జిల్లాల్లోనే భూగర్భ జలాల నీటిమట్టం పెరిగింది. మెదక్‌ జిల్లాలో 0.92 మీ.లు, మంచిర్యాలలో 0.1 మీ.లు మేర వృద్ధి నమోదు కాగా, సిద్దిపేట జిల్లాలో మార్పు లేదు.  

28% భూభాగంలోనే సురక్షితం  
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా భూగర్భ జలాల లోతులను భూగర్భ జలశాఖ వర్గీకరించింది.  
⇒ రాష్ట్ర విస్తీర్ణంలోని 28 శాతం ప్రాంతంలోనే 5 మీ.ల కంటే తక్కువ లోతుల్లోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. 5 మీ.ల లోపు లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తే సురక్షిత పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణిస్తారు. అంటే, రాష్ట్రంలోని 28 శాతం భూభాగంలోనే భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్నాయి.  
⇒ రాష్ట్రంలో సింహభాగం..అంటే 46% విస్తీర్ణంలోని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 5–10 మీ.ల లోతుల్లో ఉన్నాయి.  
⇒ రాష్ట్రంలోని 20 శాతం విస్తీర్ణంలోని ప్రాంతాల్లో భూగర్భ జలాలు 10 నుంచి 15 మీటర్ల లోతుకు పడిపోయాయి.  
⇒ రాష్ట్ర విస్తీర్ణంలోని 5 శాతం ప్రాంతంలో 20 మీ.ల కంటే అధిక లోతుల్లోకి భూగర్భజలాలు పతనమయ్యాయి. ఇవి ప్రధానంగా మేడ్చల్‌–మల్కాజిగిరి నైరుతి భాగాలు, రంగారెడ్డి ఉత్తర భాగాలు, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల ఆగ్నేయ, పశ్చిమ భాగాలు, కామారెడ్డి ఉత్తర భాగాలు, నాగర్‌కర్నూల్‌ దక్షిణ–మధ్య భాగాలు, భూపాలపల్లి ఉత్తర భాగాలు, నిజామాబాద్‌ దక్షిణ భాగాలు, భద్రాద్రి జిల్లాల ఆగ్నేయ భాగాల్లో విస్తరించి ఉన్నాయి  

దశాబ్దపు సగటు కన్నా పతనం  
ఆగస్టు నెల దశాబ్దపు (2016–2025) సగటు లోతు 7.59 మీ.లతో పోలిస్తే ప్రస్తుతం(7.87 మీ) మరింత లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. రాష్ట్రంలోని 621 మండలాల్లో పరిశీలిస్తే..266 మండలాల్లో (43%) దశాబ్దపు సగటు కంటే నీటి మట్టాలు పెరిగాయి. 355 మండలాల్లో (57%) దశాబ్దపు సగటు కంటే నీటి మట్టాలు పడిపోయాయి. 128 మండలాల్లో 2 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోవడం గమనార్హం. 20 మీటర్ల కంటే అధిక లోతుల్లో భూగర్భ జలాలుంటే.. అత్యంత లోతైన భూగర్భజలాల ప్రాంతాలుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల దశాబ్దపు సగటు విస్తీర్ణం 1,168 చ.కి.మీ ఉండగా, గత ఆగస్టు నాటికి 1,413 చ.కి.మీ.కు పెరిగింది. 

నగర ప్రాంతాల్లోనే ఆందోళనకరం  
మే 2026 (వర్షాకాలానికి ముందు)తో పోలిస్తే జూలై–ఆగస్టు వర్షాలతో భూగర్భ జలాలు 1.61 మీటర్లు పైకి ఉబికివచ్చినా, గత ఏడాదితో పోలిస్తే 2.09 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంత జిల్లాలైన హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డిలతోపాటు వ్యవసాయాధారిత సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో పాతాళ గంగ మరింత లోతుకు పడిపోయింది. రాబోయే రోజుల్లో నీటి పొదుపు చర్యలు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు చేపట్టకపోతే తాగు,సాగు నీటిఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదముందని భూగర్భ జలశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement