హిజ్రా మాఫియా: తొలుత రెక్కీ.. తర్వాత రౌండప్‌! | Hijra mafia rampant in Hyderabad | Sakshi
Sakshi News home page

హిజ్రా మాఫియా: తొలుత రెక్కీ.. తర్వాత రౌండప్‌!

Sep 7 2026 5:35 AM | Updated on Sep 7 2026 5:35 AM

Hijra mafia rampant in Hyderabad

హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హిజ్రా మాఫియా

అసలైన ట్రాన్స్‌జెండర్ల కంటే నకిలీలతోనే ఎక్కువ ఇబ్బందులు 

ఇళ్లల్లో వేడుకలు, దుకాణాల ప్రారంభం సమయంలో బెదిరింపులు 

వాహనాలపై తిరుగుతూ ఆయా ప్రాంతాల గుర్తింపు..వాట్సాప్‌లో గ్యాంగ్‌కు సమాచారం 

అడిగినంత ఇవ్వకుంటే నానా రచ్చ..వికృత, అశ్లీల చేష్టలు, దుర్భాషతో నరకం 

ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నా ఇంకా కొనసాగుతున్న వ్యవస్థీకృత దందా 

అన్ని కమిషనరేట్లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామన్న డీజీపీ సీవీ ఆనంద్‌ 

‘112’కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి: సీపీ వీసీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు చింతల్‌లో హిజ్రాలు శుక్రవారం హల్‌చల్‌ చేశారు. గృహప్రవేశం జరుగుతున్న ఇంటికి వెళ్లిన ట్రాన్స్‌జెండర్ల బృందం వారి నుంచి రూ.50 వేలు డిమాండ్‌ చేసింది. అంత మొత్తం ఇవ్వడానికి యజమాని ససేమిరా అనడంతో రెచ్చిపోయిన హిజ్రాలు తమ వికృత చేష్టలతో వారికి నరకం చూపించారు. ఈ ఉదంతం తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే శుభకార్యాలు జరిగే ఇళ్లు, కొత్తగా ఏర్పా టయ్యే దుకాణాలు/వ్యాపార సంస్థలు, ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద వీరి ఆగడాలు నగర జీవికి కొత్తేం కాదు. అనేకమంది వేడుకల సమయంలో వీరి బారినపడ్డ వారే. వీరి విషయంలో పోలీసు విభాగం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన ఉండట్లేదనే విమర్శ ఉంది. నిజానికి ప్రభుత్వం హిజ్రాలకు ట్రాఫిక్‌ పోలీసు, హైదరాబాద్‌ మెట్రో, హైడ్రాల్లో పని చేయడానికి అవకాశం కల్పిస్తోంది. వీటికి తోడు మరికొన్ని సదుపాయాలు కావాలని హిజ్రాలు కోరుతుండగా.. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే అడ్డగోలుగా వ్యవహరించే హిజ్రాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ ‘సాక్షి’తో అన్నారు.  

కలిసొస్తున్న సెంటిమెంట్‌! 
సమాజంలో ఉన్న అసలైన హిజ్రాల కంటే ఆ వేషం వేసుకుని సంచరించే నకిలీలతోనే ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నారు. వీళ్ల వసూళ్ల దందా ఆద్యంతం వ్యవస్థీకృతంగా సాగుతుంది. వీళ్లు సాధారణ రోజుల్లో జంక్షన్లు, దుకాణాల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతూ భిక్షాటన చేస్తారు. ఇక మంచి రోజులు, ముహూర్తాలు ఉన్న సమయంలో వివాహాలు, ఇతరత్రా వేడుకలు, దుకాణాల ప్రారం¿ోత్సవాల వద్దకు చేరుకుంటారు. ఈ సీజన్‌లో హిజ్రాల్లో కొందరు ఆయా కాలనీలు, రహదారుల వెంట ద్విచక్ర వాహనాలు, ఆట్లో తిరుగుతూ టెంట్లు వేసిన, అలంకరించి ఉన్న ఇళ్లు, వ్యాపార సంస్థల్ని గుర్తిస్తారు. ఈ వివరాలు, లోకేషన్‌ను ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తమ వారికి చేరవేస్తారు. ఈ వెంటనే గ్రూపులుగా ఏర్పడే హిజ్రాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో గ్యాంగ్‌ చొప్పున వెళుతుంది. ఇళ్లు, దుకాణాల యజమానులను చుట్టుముట్టి భారీ మొత్తంలో డిమాండ్‌ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే నానా రభస సృష్టిస్తారు. వికృత చేష్టలకు పాల్పడతారు. అశ్లీల పదాలతో దూషిస్తారు. తమకు నచ్చిన మొత్తం అందేదాకా ఇది కొనసాగుతుంది. ఒకరు వసూలు చేసిన చోట మరొకరు వసూలు చేయకుండా ఇంటి గేటు, గోడపై ఓ గుర్తు పెట్టి వెళ్తారు. మరోపక్క అనేక మందికి ఈ హిజ్రాలు శపిస్తే కీడు జరుగుతుందనే సెంటిమెంట్‌ ఉండటం కూడా వీరికి కలిసి వస్తోంది. కొందరు బాధితులు ఈ కారణంగానే పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదు. కొన్నిసార్లు ఫిర్యాదులు అందినా... చర్యలు తీసుకుంటే ఠాణాల వద్ద హిజ్రాలు చేసే హంగామా, రాద్ధాంతం తట్టుకోలేక పోలీసులు సైతం మిన్నకుండిపోతున్నారనే విమర్శలున్నాయి.  

అవకాశాలు వినియోగించుకోవాలి 
ట్రాన్స్‌జెండర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక విభాగాల్లో పని చేసేందుకు అవకాశం ఇస్తోంది. నిరక్షరాస్యుల కోసం స్వయం సహాయక సంఘాల మాదిరిగా రుణాలు అందిస్తోంది. వీటిని అందరూ అందిపుచ్చుకోవాలి. అయితే కొందరు ట్రాన్స్‌జెండర్లలో ఉద్యోగం చేస్తే వచ్చే జీతం సరిపోదనే భావన ఉంది. అందుకే భిక్షాటన, వసూళ్లు చేస్తున్నారు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతం జల్సాలకు సరిపోకపోవచ్చు కానీ.. బతకడానికి సరిపోతుంది. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌జెండర్లు తమ పంథా మార్చుకోవాలి. 
– నవీన, మెట్రో రైల్‌ సెక్యూరిటీ 

మాకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేయాలి 
ప్రభుత్వం మాకు అవకాశాలు కల్పిస్తున్నా ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా గది అద్దెకు తీసుకుందామంటే యజమానులు ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా రెట్టింపు బాడుగ వసూలు చేస్తున్నారు. ఈ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. నా స్నేహితురాళ్లల్లో సహస్ర చారీ బీఈడీ చేశారు. హనీ సింగ్‌ హెవీ వెహికిల్స్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి వారికి ఆయా రంగాల్లో అవకాశం కల్పించాలి. మైనారీ్ట, ఎస్సీఎస్టీ, బీసీ హాస్టళ్ల మాదిరిగా మాకు కూడా హాస్టళ్లు ఏర్పాటు చేయాలి. మాలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందించాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే మరికొందరు ట్రాన్స్‌జెండర్లు సాధారణ జీవితం గడపడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. 
– సోఫియా, మెట్రో రైల్‌ సెక్యూరిటీ 

ఉన్నతాధికారుల దృష్టికి వేధింపులు: డీజీపీ సీవీ ఆనంద్‌  
ట్రాన్స్‌జెంటర్లతో ఎదురవుతున్న ఇబ్బందులపై డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదివారం ‘ఎక్స్‌’వేదికగా స్పందించారు. హైదరాబాద్‌లో నకిలీ హిజ్రాల మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్‌ చేసిన విజ్ఞప్తికి స్పందనగా ఒక పోస్టు పెట్టారు. ‘ట్రాన్స్‌జెండర్ల వేధింపులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. నిజానికి నేను హైదరాబాద్‌ సీపీగా ఉన్నప్పుడే ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయి. అప్పట్లో వీరి బెడదను అరికట్టడానికి ఒక ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాం. అలాంటి డ్రైవ్‌ను మరోసారి చేపట్టాలని పోలీస్‌ కమిషనర్లను ఆదేశిస్తా. ట్రాన్స్‌జెండర్లను ప్రధాన సామాజిక స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. హైదరాబాద్‌లో వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. వాళ్లు కూడా బాగానే పని చేస్తున్నారు..’అని డీజీపీ పేర్కొన్నారు.  

త్వరలో సమగ్ర విధానం 
హద్దుమీరి ప్రవర్తించే ట్రాన్స్‌జెండర్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొందరిపై కేసులు కూడా నమోదు చేశాం. అయితే బాధితుల్లో అనేక మంది ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. ట్రాన్స్‌జెండర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది వెంటనే ‘112’కు ఫోన్‌ చేసి మా దృష్టికి తీసుకురండి. సమీప పోలీసుస్టేషన్‌కూ ఫోన్‌ చేయొచ్చు లేదా నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. తక్షణం స్పందించి కఠిన చర్యలు తీసుకుంటాం. వీరివల్ల నగరవాసులకు ఎదురవుతున్న సమస్యకు పరిష్కారం కోసం త్వరలోనే సమగ్ర విధానం రూపొందించనున్నాం. 
– వీసీ సజ్జనర్, హైదరాబాద్‌ కొత్వాల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement