సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల దుస్తులు ధరించి బీఆర్‌ఎస్‌నేతలు అసెంబ్లీకి చొచ్చుకొళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర గందరళగోళం నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారని, నల్ల దుస్తులు ధరించి ఆసెంబ్లీకి వస్తే తప్పేంటని ఆమె మండిపడ్డారు.
కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ నల్లదస్తులతో పార్లమెంట్‌కు వెళితే తప్పులేనప్పుడు తాము అదే తరహాలో నిరసన చేపడితే తప్పు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మనుపెన్నడూ ఇలాంటి పాలన చూడ లేదన్నారు. పోలీసులు ముసుగులో రౌడీలను దించారని.. రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఇతర మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ వారు ఆవేదన వ్యక్తంచేశారు.
మరోవైపు అసెంబ్లీ లోపలికి వెళ్తున్న సమయంలో పోలీసులు ఇష్టానుసారంగా తోసేశారు, చీర లాగేశారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఎలాంటి ప్లకార్డులు లేకుండా లోపలికి వెళ్లాం, కాలికి గాయమైంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదంటూ విమర్శించారు. పోలీసుల ప్రవర్తనకు ఆమె తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజని అభివర్ణించారు. ఈ నిరసనల నేపథ్యంలో పోలీసులు, బీఆర్‌ఎస్‌నేతల మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రులు కేటీఆర్,హరీష్ రావు, జగదీష్‌రెడ్డి, తదితర నేతలను అదుపులోకి తీసుకున్నారు.


