తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే.. ‘మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న త్రిష వివాదానికి మరింత వేడి పెంచాయి. ఉదయనిధి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాన్ని ఉద్దేశించేలా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్..‘భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. మన ప్రజలను, మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు. మన ఇళ్లలో మహిళలు తల్లులు, సోదరీమణులుగా ఉన్నారు. మహిళలను అవమానిస్తే చట్టం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.
రాజకీయ విమర్శ వేరు..
అయితే విజయ్ మాత్రం రాజకీయ విమర్శలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను అవమానించే వ్యాఖ్యలకు ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా విజయ్ మాట్లాడారు. పోలీసులు కేవలం నేరస్తులను అరెస్టు చేయడానికే పరిమితం కాకూడదని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలు లక్ష్యమని చెప్పారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు స్నేహితులుగా.. ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉండాలని పేర్కొన్నారు.
TN Assembly:
“If anyone talks in a derogatory manner about women, stern action is assured.”
- TN CM Vijay, recalls 'humiliation' of former CM Jayalalithaa in the Assembly pic.twitter.com/c7Y6bD1kCo— News Arena India (@NewsArenaIndia) September 7, 2026
పోలీసులకు హెచ్చరికలు..
తమ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయ్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరాలను ముందుగానే నిరోధించేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై కూడా విజయ్ కఠిన వైఖరి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్‌లో జరిగే నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని తెలిపారు.
దీంతో త్రిష వివాదం నేపథ్యంలో విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. పేర్లు ప్రస్తావించకుండా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఆగస్టు 3న తంజావూరులో జరిగిన కావేరీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు త్రిష పేరును నినాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు కావేరీ సమస్యకు మాత్రమే సంబంధించినవని ఉదయనిధి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆగస్టు 4న పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. అనంతరం అదే రోజు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా ఆయన అభివర్ణించారు.


