తమిళనాడులో ఓ రోడ్డు ప్రమాదం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అమ్మాయిలు మరణించారు. ప్రమాదకరమైన మలుపు దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం సైతం ప్రకటించారు.
నమక్కల్ జిల్లా తిరుచెంగోడు(tiruchengode Accident) సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. వారి బంధువైన మరో బాలిక.. నలుగురూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న 19 ఏళ్ల యువతి తన ఇద్దరు చెల్లెళ్లను, బంధువైన బాలికను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
సంకరంపాళయం ప్రాంతానికి చెందిన సుభిత కలైసెల్వి (19), ఆమె చెల్లెళ్లు నివేత (17), ధనుశ్రీ (12), బంధువైన అభినయ (11) ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. సుభిత కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అనంతరం.. ఎలచిపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తన చెల్లెళ్లు, అభినయను తీసుకుని ఇంటికి బయలుదేరింది. అయితే..
రసిపురం–తిరుచెంగోడు రహదారిపై చక్కరంపాళయం జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా.. రసిపురం వైపు నుంచి వచ్చిన ముత్తాయమ్మాళ్ ఇంజినీరింగ్ కళాశాల బస్సు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి నలుగురూ రోడ్డుపై పడిపోయారు. సుభిత, అభినయ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన నివేత, ధనుశ్రీని తిరుచెంగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.
డ్రైవర్ అరెస్ట్
ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎలచిపాళయం పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలించారు. చివరకు డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, మృతికి కారణమైన ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తాజా సమాచారం.
Tiruchengode 🚨⚠️
Disturbing Visuals🚨
4 on a 2 wheeler behind College Bus, taking right turn next to petrol bunk with blocked vision, headON with other Bus.
Always look ahead & behind, before taking any such turns.@DriveSmart_IN https://t.co/8hVIFtjdhE— Dave (Road Safety: City & Highways) (@motordave2) September 4, 2026
పేద కుటుంబం.. పెద్ద కష్టం
మృతుల్లో సుభిత, నివేత, ధనుశ్రీ ముగ్గురూ శేఖర్, అముధ దంపతుల కుమార్తెలు. వారు కూరగాయల వ్యాపారం/కూలీ పనులతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సుభిత చదువుకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్. ఉమా సహాయం చేసినట్లు సమాచారం. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుఓంది. ఇక అభినయ.. శేఖర్ సోదరుడు రమేశ్‌బాబు కుమార్తె. ఇలా ఒకే కుటుంబ బంధంలో ఉన్న నలుగురు చిన్నారులు, యువతులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో సంకరంపాళయంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సీఎం విజయ్ సంతాపం.. రూ.3 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి బాధ కలిగించిందని అన్నారు. మృతులు సుభిత, నివేత, ధనుశ్రీ, అభినయ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.
కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిన విషాదం
చదువుకుని జీవితంలో ఎదగాల్సిన వయసులో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, వారి బంధువైన మరో బాలిక ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. సుభిత తన చెల్లెళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్న ప్రయాణమే.. ఆ కుటుంబానికి చివరి ప్రయాణంగా మారింది. అదే సమయంలో.. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. నలుగురు ఒకే బైక్‌పై ప్రయాణించడం.. అందునా ప్రమాదకరమైన మలుపులో ప్రయాణం.. తప్పంతా యువతులదే అనే కోణంలోనూ చర్చ నడుస్తోంది.
ఇదీ చదవండి: తుక్కుతుక్కైన కారు.. 8 మంది బీటెక్ స్టూడెంట్స్ దుర్మరణం


