కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం | Kerala Thrissur Car Parked Lorry Accident News Full Details | Sakshi
Sakshi News home page

కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్‌ విద్యార్థుల దుర్మరణం

Sep 5 2026 6:39 AM | Updated on Sep 5 2026 6:57 AM

Kerala Thrissur Car Parked Lorry Accident News Full Details

ఘోర రోడ్డు ప్రమాదంతో శుక్రవారం అర్ధరాత్రి కేరళ రహదారి నెత్తురోడింది. త్రిసూర్‌ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతులంతా తమిళనాడుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు. 

కైపమంగళం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువాయూర్‌ వైపు నుంచి కొడుంగల్లూర్‌ దిశగా వెళ్తున్న కారు.. హైవేపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అగ్నిమాపక-రక్షణ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను సహాయక చర్యలు చేపట్టి బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన కారుకు తమిళనాడు రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు తమిళనాడు దిండిగల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా చెబుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే డ్రైవర్‌ మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు అదే కారు మితిమీరిన వేగంతో రోడ్డు మీద హల్‌ చల్‌ చేసిందని తెలుస్తోంది. దీనిపై పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.  

ఇదీ చదవండి: మంచి స్కూల్స్‌ అడిగితే తప్పా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement