మూడు నెలల చిన్నారితో రోడ్డుపై దీనంగా కూర్చున్న యువతి
కష్టాలు తొలగి, శుభాలు కలగాలని ఓ యువతి గుడికెళితే అక్కడ పూజలు చేసే ఓ ప్రబుద్ధుడు ఆమెను ట్రాప్ చేశాడు. ‘నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే చచ్చిపోతా’ అంటూ మభ్యపెట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా తాళి కట్టాడు. బిడ్డ పుట్టాక నడిరోడ్డుపైకి నెట్టి నరకం చూపిస్తున్నాడు. వివరాలు..
యాడికి మండలానికి చెందిన ఓ యువతి అనంతపురంలో ఉంటోంది. ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తూ జీవనం సాగించేది. జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురుకావడంతో రాప్తాడు మైనార్టీ కాలనీలోని సుంకులమ్మ గుడికి వెళ్లి పూజలు చేస్తే కష్టాలు తొలుగుతాయని తెలిసిన వారు చెప్పడంతో ఆలయానికి వెళుతూ ఉండేది. అక్కడ పూజలు చేసే శివకుమార్ కన్ను యువతిపై పడింది. తాను చెప్పిన పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని.. జీవితంలో ఉన్నత స్థాయికి వెళతావని నమ్మించాడు. తర్వాత వివిధ ఆలయాల్లో పూజలు చేయించి యువతిని లోబరుచుకున్నాడు.
నిలదీయడంతో.. శ్రీశైలంలో పెళ్లి
యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శివకుమార్ ఆమెను శారీరంగా కలుస్తూ ఉండేవాడు. దీంతో ఆమె గర్భం దాలి్చంది. గట్టిగా నిలదీయడంతో యువతి బంధువులకు తెలియకుండా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి 2025 మేలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి యువతికి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, ఆడపడుచులు నిత్యం వేధించేవారని యువతి కన్నీటి పర్యంతమవుతూ తెలిపింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త తీవ్రంగా కొట్టడంతో యువతి రాప్తాడు పోలీసులను ఆశ్రయించింది. దంపతులిద్దరినీ పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినా శివకుమార్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
బాబు పుట్టినా.. పుట్టింటికే పరిమితం
తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కాన్పు కోసం యువతి పుట్టింటికి చేరుకుంది. ఈ ఏడాది మే 25న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మూడు నెలల తర్వాత తనను, తన బిడ్డను తీసుకెళతానని చెప్పిన శివకుమార్ ముఖం చాటేశాడు. ‘నీతో నేను కలిసి బతకలేను.. నీతో ఉంటే నువ్ నన్ను చంపేస్తావ్’ అంటూ బూటకపు మాటలు చెప్పి యువతిని దూరం పెట్టాడు. దీంతో యువతి ఆగస్ట్ 13న రాప్తాడు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త నమ్మించి మోసం చేస్తున్నాడని, న్యాయం చేయాలని వేడుకుంది. చేతిలో రెండు నెలల చిన్నారిని పెట్టుకుని ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసు స్టేషన్ గుమ్మం వద్దే పడిగాపులు కాచింది. అయినా, పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదు.
సీఐ నిర్లక్ష్యం..!
న్యాయం కోసం యువతి 20 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సీఐ వెంకటేశ్వర్లు మనసు కరగలేదు. ‘చెప్పావ్ గా... వాడు కనిపిస్తే తీసుకొస్తాం లే.. నువ్ వెళ్లు..’ అంటూ నిర్లక్ష్యంగా చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో యువతి ఇటీవల ఎస్పీ జగదీశ్‌ను ఆశ్రయించింది. పీజీఆర్‌ఎస్‌లో కలిసి ఫిర్యాదు చేయడంతో అప్పుడు సీఐ స్పందించారని యువతి చెబుతోంది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటోంది. -అనంతపురం
చదవండి: నేవి ఉద్యోగి భార్య ఆత్మహత్య


