లోకేశ్‌ అంకెల గారడీపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YS Jagan Slams Minister Nara Lokesh Over Literacy Rate Numbers | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ అంకెల గారడీపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Sep 4 2026 12:03 PM | Updated on Sep 4 2026 1:34 PM

YS Jagan Slams Minister Nara Lokesh Over Literacy Rate Numbers

సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్‌ జగన్‌ తన ఎక్స్‌ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.

2025లోనూ తగ్గిందే..
2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్‌ఎఫ్‌ఎస్‌ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్‌ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్‌ చేశారు.

‘ఇది తప్పుడు ప్రచారం’..
2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్‌ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..
ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్‌ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్‌ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..
విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్‌ సూచించారు. ‘రెడ్‌బుక్‌ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్‌.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్‌ ఎవరబ్బా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement