మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఏదో తెలియని ఆందోళనతో, ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమి చెప్పాలో అర్థంకాకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. వైఎస్సార్‌సీపీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విజయసాయి సడన్‌గా ఎంపీ పదవి వదలుకోవడం, పార్టీని సైతం వీడడం సంచలనం అయింది. ఇందులో ఏమి మతలబు ఉందా అన్న చర్చ జరిగింది. కాని ఆయన మాత్రం తాను వ్యవసాయం చేసుకుంటానని, రాజకీయాలకు దూరంగా ఉంటానని అప్పట్లో ప్రకటించారు. చాలామంది ఆయన మాటకు కట్టుబడి ఉంటారేమోలే అని సరిపెట్టుకున్నారు.
కాని కొంతకాలం గడిచే కొద్ది ఆయనలో మార్పు రావడం ఆరంభం అయింది. తొలుత అక్కడక్కడ కామెంట్లు చేయడం, తదుపరి వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం, ప్రత్యేకించి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించడం అందరిని విస్మయపరిచింది. రాజకీయ పార్టీలలో నేతల మధ్య తెలియని స్పర్ధ ఉంటుంది. అయినా పార్టీలో ప్రధాన నాయకుడిని చూసి సర్దుకుపోతుంటారు. పైగా విజయసాయికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్ద లభించిన ప్రాధాన్యత చాలా ఎక్కువే. పార్టీలో పలువురికి దీనిపై కాస్త అసంతృప్తి ఉన్నా ఎవరూ పైకి మాట్లాడలేదు.
ప్రత్యేకించి విశాఖపట్నం ఇన్‌చార్జీగా ఉన్న సమయంలో ఈయనపై ఎల్లోమీడియా విపరీతమైన వ్యతిరేక వార్తలు ఇచ్చేది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఈయన టార్గెట్‌గానే ఉండేవారు. ఈయన బందువులు విశాఖలో స్థలం కొనుగోలు చేసినా ఎల్లోమీడియాలో ఆరోపణలు వచ్చేవి. చివరికి ఆయనపై ఎంత నీచమైన అభియోగాలు మోపింది అందరికి తెలుసు. టీడీపీ మీడియాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ విజయసాయి మీడియా సమావేశాలు పెట్టేవారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా మొదటి పేజీతో పాటు, లోపలి పేజీలో పెద్ద ఎత్తున పరచిందంటే అందులో ఉన్న మతలబు అర్థం చేసుకోవచ్చు.
ఆ రకంగా చూస్తే విజయసాయి తనకు ఇంత ప్రచారం ఆ మీడియాలో వస్తోందని సంతోషిస్తున్నారేమో తెలియదు కాని, అది పులిమీద స్వారీలాంటిదే అని తెలుసుకోగలగాలి. నిజంగానే ఆయన చెబుతున్నట్లు కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత కూడా తన విధానాలపై ప్రచారం చేసుకుంటే ఫర్వాలేదు. అధికారంలో ఉన్న టీడీపీ, జనసన, బీజేపీ కూటమి విధానాలను వ్యతిరేకిస్తారో, మద్దతు ఇస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఆయన అసలు లక్షణం బయటపడుతుంది.
ప్రభుత్వ విధానాలలోని మంచి, చెడులపై వ్యాఖ్యానిస్తే తప్పు కాదు. కూటమి ప్రభుత్వంపై కాకుండా వైఎస్సార్‌సీపీపైనే దృష్టి కేంద్రీకరిస్తే, టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడానికే ఈ రెండేళ్లుగా రాజకీయం నడిపారని జనం అనుకుంటారు. అంటే టీడీపీ ట్రాప్‌లో విజయసాయి పూర్తిగా చిక్కుకున్నట్లు అవుతుంది. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత విజయసాయిపైన కాని, ఆయన సమీప బంధువులపై కాని కూటమి ప్రభుత్వం పలు కేసు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి యత్నించింది. దానికి తోడు విశాఖలో ఈయన అనుచరులు భూ దందాలకు పాల్పడ్డారని పదే, పదే ప్రచారం చేశారు. అప్పటికే మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో పలువురిని అరెస్టు చేశారు. విజయసాయి పేరు కూడా కేసులో చేర్చారు.
ఈ కేసుల బెడద, ఎల్లోమీడియా దాడి భరించలేకే ఈయనలో బాగా మార్పు వచ్చిందా అన్నది కొందరి అనుమానం. ఆ కేసులో ఉన్న ఇతర నిందితులు కొందరితో ఆయన వివాదపడుతున్నట్లు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. మొత్తం మీద ఏ రకంగా మేనేజ్ చేసుకున్నారో కాని చంద్రబాబు ప్రభుత్వం ఐదో నిందితుడుగా ఉన్న ఆయన జోలికి వెళ్లలేదు. ఆ క్రమంలోనే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దానిని టీడీపీ చేజిక్కించుకోవడం వంటివి జరిగాయి.
ఇవి కూడా చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?
ఈ నేపథ్యంలో విజయసాయి తాజాగా చేసిన ప్రకటనలు సహజంగానే అందరికి సందేహాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మత మార్పిడులను జగన్ ప్రోత్సహించారంటూ దారుణమైన ఆరోపణ చేయడం ఆయనకే చెల్లింది. అదే నిజమైతే ఈయననే మార్చి ఉండాలి కదా అన్న విమర్శకు బదులు లేదు. జగన్ అధికారంలో ఉండగా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఈపాటికి కూటమి ప్రభుత్వం ఎంత యాగీ చేసేదో కదా! పైగా హిందూ ధర్మపరిరక్షణకు అవసరమైన అనేక చర్యలు జగన్ తీసుకున్నారు.
విజయసాయి చేసిన ఈ విమర్శపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఈసారి బహరంగ లేఖ పేరుతో సజ్జలపై విరుచుకుపడే యత్నం చేశారు. ఆయన పార్టీలో నెంబర్ వన్‌గా ఉన్నారంటూ జగన్‌ను తగ్గించే యత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందో లేదో ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నప్పుడే ఆయనకు ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడే బయటకు వచ్చి ఉండవచ్చు లేదా ఓపెన్ అయి ఉండవచ్చు. అలాకాకుండా ఎన్నికలలో ఓటమి ఎదురయ్యాక మాట్లాడడమే అభ్యంతరం అనిపిస్తుంది. సజ్జలపై కేసులు రాలేదని ఆయన చెబుతున్నారంటే దాని అర్థం టీడీపీతో కుమ్మక్కైనట్లు కాదు.
నిజానికి సజ్జలపైన, ఆయన కుమారుడు భార్గవపైన పలు కేసులను ప్రభుత్వం పెట్టింది. వాటిలో పలు పిచ్చి కేసులు ఉన్నాయి. లుక్ అవుట్ నోటీసుల వరకు వెళ్లింది. అయితే వాటన్నిటిపైన న్యాయపోరాటం చేసి స్టేలు తెచ్చుకున్నారు. అంతే తప్ప విజయసాయి మాదిరి భయపడి పోలేదని అనుకోవాలి. ఒకప్పుడు విజయసాయికి ఉన్న ధైర్యం ప్రస్తుతం లేకుండా పోయిందని అనుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మాదిరి పోరాడే శక్తిని ఆయన కోల్పోయారని భావించాలి. సజ్జల వల్ల తాను పార్టీని వీడడం లేదని గతంలో చెప్పిన విజయసాయి మాట మార్చి, ఏకంగా తనపై భౌతిక దాడి జరిగిందని, 74 సార్లు అవమానాలు జరిగాయని ఆరోపించేవరకు వెళ్ళడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అది నిజమే అయితే, ఆనాడే ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి ఉండాల్సింది కదా! అప్పుడే పదవులను వదలుకుని ఉండాలి కదా!అధికారం కోల్పోయాక చేసే ఆరోపణలకు విలువ ఏమి ఉంటుంది. ఆయన ప్రతిష్ట దెబ్బతినడం తప్ప. తనను ఎన్నో విధాలుగా వేధించిన ఎల్లో మీడియాకు అస్త్రంగా మిగలడం తప్ప. ఆయన వ్యాఖ్యలు చిన్నపిల్లల చేష్టల మాదిరిగా కనిపిస్తున్నాయి.
గతంలో చంద్రబాబుపై, టీడీపీపై విజయసాయి కొన్ని అభ్యంతర పోస్టులు పెట్టడం ద్వారా పార్టీని ఇరుకున పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా సీనియర్ నేత కనుక ఎవరూ మాట్లాడలేదు. తనతో పాటు విజయసాయిపై కూడా అక్రమ కేసులు పెట్టారన్న సానుభూతి ఉండబట్టే కదా జగన్ ఈయనను రెండుసార్లు ఎంపీని చేశారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిని చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. కాని వివిధ పరిణామాల నేపథ్యంలో పార్టీలో మార్పులు జరుగుతుంటాయి. ఆ సంగతి ఆయనకు తెలియదా! అయితే ఇప్పటికీ జగన్‌కు నమ్మక ద్రోహం చేయనని అనడం మంచిమాటే. కాకపోతే టీడీపీ ట్రాప్‌లో పడి, వారు రాసిచ్చే స్క్రిప్టు చదివే దశకు విజయసాయి వెళితే అది మరింత బురద ఊబిలో కూరుకుపోతున్నట్లే అవుతుందేమో! ఆ సంగతి ఆయన గ్రహిస్తే మంచిదే!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


