హూ ఈజ్‌ మోదీ.. పవన్‌? | CM Chandrababu Unexpected Comments On Modi, Pawan Kalyan | Sakshi
Sakshi News home page

హూ ఈజ్‌ మోదీ.. పవన్‌?

Sep 4 2026 9:26 AM | Updated on Sep 4 2026 9:58 AM

CM Chandrababu Unexpected Comments On Modi, Pawan Kalyan

సాక్షి, విశాఖపట్నం:  ‘హూ ఈజ్‌ మోదీ? ఆయన నాకంటే సీనియరా? నాకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయ్యారా? ‘ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్‌ కల్యాణ్‌కు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం, ప్రధాని మోదీ ఎందుకు కనిపించడం లేదు? ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఆయనకంటూ ఒక విధానం, ఒక స్టాండ్‌ లేదు.’ ఇవి కూటమిగా ఏర్పడకముందు చంద్రబాబు మొదటి నాలుక పలికిన పలుకులు. 

కట్‌ చేస్తే.. కూటమిగా ఏర్పడిన తర్వాత.. 
‘నరేంద్ర మోదీ 21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకెంతో గర్వకారణం.’ 

‘పవన్‌ కల్యాణ్‌ నిఖార్సైన నాయకుడు, నిజాయితీపరుడు. ఆయనకు పదవుల మీద, ప్యాకేజీల మీద వ్యామోహం లేదు’. ఇదీ.. చంద్రబాబు రెండో నాలుక సూక్తులు. 

అందితే జుట్టు.. అందకపోతే వెన్నుపోటు.. అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో ఎవరితోనైనా జట్టులు కట్టే బాబు.. ఎన్నికలు అయ్యాక మాత్రం.. ఏరు దాటాక.. అన్న చందంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని మరోసారి బుద్ధిని బయటపెట్టారు. ఎన్నికలకు ముందు మోదీ దేవుడు.. పవన్‌ తమ్ముడంటూ అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని పక్కన పెట్టేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

మోదీ, పవన్‌ బొమ్మలు మాయం!  
రాష్ట్రంలో ఇంటింటికీ పంచుతున్న ‘కూటమి ప్రభుత్వం.. సంక్షేమ విజయాలు’ కరపత్రాల్లో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలను నిర్దాక్షిణ్యంగా మాయం చేశారు. సినిమా హిట్టయ్యే దాకా హీరోలు కావాలి.. కలెక్షన్లు వచ్చాక పోస్టర్‌పై తన బొమ్మ మాత్రమే ఉండాలి అన్నట్లుగా బాబు చేస్తున్న ఈ సింగిల్‌ క్రెడిట్‌ సోలో పెర్ఫార్మెన్స్‌.. నిన్నటి దాకా ‘మా మోదీ, మా పవన్‌’ అన్న నోటితోనే, నేడు కరపత్రాల సాక్షిగా ‘హూ ఈజ్‌ మోదీ.. హూ ఈజ్‌ పవన్‌’ పార్ట్‌–2 డ్రామాకు తెరతీసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కింగ్‌ మేకర్లు కరివేపాకయ్యారా? 
కూటమి అంటే ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమేననీ.. తీరా విజయాల క్రెడిట్‌ తీసుకునే సమయానికి అంతా తన సోలో పెర్ఫార్మెన్సే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాంధ్ర వీధుల్లో తిరుగుతున్న ఆ కరపత్రం పేరుకే ‘కూటమి’ విజయాలు. కానీ అందులో ప్రధాని మోదీ కానీ.. పవన్‌ ఫొటో కానీ కనిపించడం లేదు. కేవలం తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు మాత్రమే ముద్రించుకోవడం గమనార్హం. 

సొమ్ము ఢిల్లీది.. సోకు బాబోరిది! 
రాష్ట్రంలో ఏ చిన్న సంక్షేమ పథకం అమలు చేయాలన్నా.. కేంద్రం ఇచ్చే నిధులు, రుణాలు విదిలిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఢిల్లీ నుంచి వస్తున్న వేల కోట్ల రూపాయలతోనే రాష్ట్రంలో హడావిడి డ్రామా నడుస్తోంది. కానీ ప్రచారానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఫోజులు కొడుతూ డప్పు కొట్టుకుంటోంది. మోదీ పంపిన నిధులతో జరిగిన పనులన్నింటినీ తన క్రెడిట్‌లో వేసుకుంటూ, కరపత్రాల్లో మోదీ ఫొటోకు మాత్రం తెలివిగా కత్తెర వేసేశారు. ఈ ‘పచ్చ’ పైత్యాన్ని చూసి అటు కమలనాథులు, ఇటు జనసైనికులు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు 2018 నాటి ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తుకొస్తోందని మండిపడుతున్నారు. అధికార మదంతో అప్పుడే అహంకారం తలకెక్కితే, ఈ కరపత్రాల మంటలు రేపు టీడీపీ పునాదులకే ఎసరు పెడతాయంటూ బీజేపీ రాష్ట్ర ధారి్మక సెల్‌ ప్రతినిధి విజయ శంకర్‌ ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.  

 

చదవండి: నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement