మార్గదర్శి డిపాజిట్లపై రూ.2,699 కోట్లు ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాలి | Rs 2699 crore in income tax must be paid on Margadarsi deposits: Undavalli Arun Kumar | Sakshi
Sakshi News home page

మార్గదర్శి డిపాజిట్లపై రూ.2,699 కోట్లు ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాలి

Sep 4 2026 5:51 AM | Updated on Sep 4 2026 5:51 AM

Rs 2699 crore in income tax must be paid on Margadarsi deposits: Undavalli Arun Kumar

నగదు రూపంలో రూ.1,156 కోట్ల డిపాజిట్లు సేకరించారు 

ఇది ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘనే.. మార్గదర్శిపై కేసు కొట్టేయలేదు... రామోజీరావు చనిపోయిన కారణంగా రద్దు చేశారు 

ఫిల్మ్‌ సిటీలో ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం ఉల్లంఘనలు ఉన్నాయి 

పోలవరం అంటే గుర్తొచ్చేది వైఎస్సారే 

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో ఆ సంస్థ రూ.2,699 కోట్ల ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మార్గదర్శి అవకతవకలపై పోరాటంలో భాగంగా 2007లో తాను ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం రూ.20 వేల లోపు మాత్రమే నగదు తీసుకోవాలని, అంతకు మించితే చెక్కు రూపంలో లేదా ఆన్‌లైన్‌ లావాదేవీలే జరపాలని చెప్పారు. అయినప్పటికీ మార్గదర్శిలో రూ.20 వేలకు మించి నగదు రూపంలో మొత్తం రూ.1,156 కోట్లు డిపాజిట్లుగా సేకరించారని తెలిపారు. ఆర్‌బీఐకి చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా సమాంతర బ్యాంకింగ్‌ వ్యవస్థను రామోజీరావు నడిపారన్నారు. 

ఇదే విషయమై తాను ఫిర్యాదు చేయడంతో ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు రామోజీరావుకు నోటీసులు జారీ చేయగా, ఆయన వెంటనే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. వాస్తవానికి జరిమానా విధిస్తే తప్ప, నోటీసు మీద స్టేకు అవకాశం లేదని అన్నారు. ఈ కేసులో నగదు రూపంలో వసూలు చేసిన రూ.1,156 కోట్లకు సాధారణ వడ్డీ లెక్కకట్టినా రూ.2,699 కోట్లు అవుతుందని చెప్పారు. ఆ కేసు తాజా పరిస్థితిని తెలియజేయాలని గతేడాది ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులకు తాను లేఖ రాయగా.. ఆ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని తెలిపారు. 

దీనిపై ఆర్‌టీఐ కమిషనర్‌కు అప్పీల్‌ చేసినట్టు చెప్పారు. మరోవైపు.. నోటీసు ఇచ్చే అర్హత జాయింట్‌ కమిషనర్‌కే ఉందని, అడిషనల్‌ కమిషనర్‌కు లేదనే కారణంతో ఇటీవల ఈ కేసును హైకోర్టులో కొట్టేశారన్నారు. వాస్తవానికి ఎవరు నోటీసు ఇచ్చారన్నది ముఖ్యం కాదనే విషయం ఇతర కేసులను పరిశీలిస్తే తెలుస్తోందన్నారు. అయినప్పటికీ ఈ కేసు విషయమై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు అప్పీల్‌కు వెళ్లలేదని ఉండవల్లి తెలిపారు. 

ఆర్‌ఎఫ్‌సీలో ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ఉల్లంఘనలు 
రామోజీ ఫిల్మ్‌ సిటీ కోసం ల్యాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని ఉల్లంఘించి 2,200 ఎకరాలకు పైగా సేకరించారని ఉండవల్లి చెప్పారు. ఇందులో 1,364 ఎకరాలు ప్రభుత్వానికి సరెండర్‌ చేయమని రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు ఇవ్వగా.. వెంటనే రామోజీరావు కోర్టుకెళ్లి అది వ్యవసాయ భూమి కాదని, కొండలు గుట్టలతో ఉందని చెప్పి స్టే తెచ్చుకున్నారన్నారు. అయితే అంతకుముందే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని కోరుతూ ఆర్‌ఎఫ్‌సీ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తులను జాయింట్‌ కలెక్టర్‌ చూపించారన్నారు. అనంతరం భూ­మి సరెండర్‌ చేయమని నోటీసులు ఇచ్చారని చె­ప్పారు. ఆ కేసును ఇటీవల కోర్టులో కొట్టేశారని తెలిపా­రు. 

చనిపోయారనే.. మార్గదర్శిపై కేసు రద్దు చేశారు  
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై కేసు కొట్టేయలేదని, రామోజీరావు చనిపోయారనే కారణంతో కేసు రద్దు చేశారని అరుణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. క్రిమినల్‌ లా ప్రకారం నిందితుడు చనిపోతే కేసు ఆటోమేటిక్‌గా రద్దవుతుందన్నారు. ఇక్కడ కూడా రామోజీరావు ఒక్కరి మీదే కేసు పెట్టారని, ఆయనే లేరు కాబట్టి ఆ కేసు విచారించలేమని కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రాసిక్యూషన్‌ చేసేందుకు నిరాకరించాయన్నారు. అందువల్ల కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పిందన్నారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తున్నా అని చెప్పారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ఉల్లంఘనల పైనా కోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. 

పోలవరానికి ఆద్యుడు వైఎస్సార్‌ 
పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పగానే గుర్తొచ్చేది దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డేనని ఉండవల్లి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని శాఖల నుంచీ అనుమతులు తేవడంతో పాటు కాలువలు కూడా వైఎస్సార్‌ పాలనలోనే తవ్వించారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా వైఎస్సార్‌ను గుర్తుకు తెస్తాయన్నారు. ప్రస్తుతం పోలవరం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే నేపాల్‌ లాంటి ఉపద్రవం ముంచుకొస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు గోదావరి నీళ్లే ఉత్తరాంధ్రకు ఇచ్చారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి దాని నుంచి నీళ్లు ఇవ్వలేదని ఉండవల్లి స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement