అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖ | Political History Of Warangal Konda Surekha Incident | Sakshi
Sakshi News home page

అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖ

Sep 4 2026 7:56 AM | Updated on Sep 4 2026 9:48 AM

Political History Of Warangal Konda Surekha Incident

ఇద్దరు మంత్రులపై బర్తరఫ్‌ వేటు

రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి.. సురేఖ స్థానంలో ఎవరు?

2021లో ఈటల రాజేందర్‌పైన.. 

చర్చనీయాంశంగా మారిన  మంత్రుల ‘బర్తరఫ్‌’  

సాక్షిప్రతినిధి, వరంగల్‌: మంత్రుల పదవులకు సంబంధించి ఉమ్మడి వరంగల్‌ రాజకీయ చరిత్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకే ప్రాంతానికి చెందిన మంత్రులు వేర్వేరు ప్రభుత్వాల హయాంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురికావడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 2015లో నాటి సీఎం కేసీఆర్‌ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను తొలగించారు. తాజాగా 2026లో సీఎం రేవంత్‌రెడ్డి కొండా సురేఖను     మంత్రివర్గం నుంచి తొలగించారు.

రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కీలక పదవి దక్కింది. ఆ తర్వాత స్వైన్‌ ఫ్లూ నియంత్రణలో వైఫల్యం, శాఖలో అవినీతి ఆరోపణలపై 2015, జనవరి 25న కేసీఆర్‌ ఆయనను మంత్రివర్గంనుంచి తొలగించారు. అదే రోజు కడియం శ్రీహరితో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు. 

సురేఖ స్థానంలో ఎవరో? 
దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రి.. మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురయ్యారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 2023, డిసెంబర్‌ 7న రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో చేరారు. తాజాగా కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత వివాదాల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గంనుంచి తొలగించారు. ఆమె స్థానంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. 

2021లో ఈటల రాజేందర్‌పైనా...
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉన్న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అప్పటి సీఎం కేసీఆర్‌ 2021, మే 2న మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. భూఆక్రమణల ఆరోపణలు కారణంగా చూపగా.. బర్తరఫ్‌ అయిన కొద్ది రోజులకు (2021 జూన్‌ 14న) రాజేందర్‌ బీజేపీలో చేరి, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సా«ధించారు.  

పరకాల కేంద్రంగానే రెండు నిర్ణయాలు 
అప్పుడు రాజీనామా.. ఇప్పుడు బర్తరఫ్‌
సాక్షి, వరంగల్‌ : వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ రాజకీయ జీవితంలో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పరకాల వేదికగానే గతంలో వైఎస్‌ జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖను వదులుకుంటే.. ఇప్పుడు అదే పరకాల పంచాయితీ ఏకంగా ఆమెను మంత్రి పదవినుంచి బర్తరఫ్‌ చేసే వరకు వెళ్లింది. వరంగల్‌ రాజకీయ చరిత్రలో మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉదంతాలు ఉన్నా.. తాజాగా చోటుచేసుకున్న బర్తరఫ్‌ మాత్రం భిన్నమైన పరిణామంగా నిలిచిందనే ప్రచారం సాగుతోంది.  

చదవండి: ఎంపీటీసీ నుంచి మంత్రి.. బర్తరఫ్‌ వరకు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement