నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా.. | Koona Ravi Kumar Over Actoin To Zilla Parishad Standing Committee Meeting | Sakshi
Sakshi News home page

నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా..

Sep 4 2026 8:38 AM | Updated on Sep 4 2026 8:54 AM

Koona Ravi Kumar Over Actoin To Zilla Parishad Standing Committee Meeting

ధర్మాన కృష్ణచైతన్య, కూన రవి మధ్య వాగ్వాదం

శ్రీకాకుళం: జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం మాటల యుద్దంతో భగ్గుమంది. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ వ్యవహార శైలితో ఈ సమావేశాల ‘స్థాయి’ తగ్గినట్టైంది. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అ«ధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఎమ్మెల్యే తన స్థాయిని మర్చిపోయి జెడ్పీటీసీలపై ఏకవచన పద ప్రయోగం చేశారు. జెడ్పీటీసీలు ధర్మాన కృష్ణచైతన్య, సురవరపు నాగేశ్వరరావులపై దాదాపుగా భౌతిక దాడికి సిద్ధమయ్యేలా వ్యవహరించారు. కూటమి రెండేళ్ల పాలనపై జెడ్పీటీసీలు విమర్శలు ఎక్కు పెట్టడంతో ఎమ్మెల్యే కూన నోటికి పని చెప్పారు. దీంతో కేవలం నాలుగు శాఖల ప్రగ తి సమీక్షలతోనే సమావేశం ముగించాల్సి వచ్చింది. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆర్‌.వెంకట్రామన్‌ తదితర జిల్లా స్థాయీ అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే. 


జెడ్పీటీసీ కృష్ణచైతన్య మీదకు వస్తున్న ఎమ్మెల్యే కూన రవి 

కలెక్టర్‌ చెప్పినా చెయ్యరా..  
పోలాకి మండలంలో జెడ్పీ నిధులతో పలు గ్రామాల్లో చేసేందుకు ఈ ఏడాది జూన్‌ 30న ఆదేశాలు వచ్చినప్పటికీ నేటికీ ఒక్క పని మొదలు పెట్టకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్‌ కూడా చెప్పినప్పటికీ అధికారులు పనిచెయ్య డం లేదని పోలాకి జెడ్పీటీసీ కృష్ణచైతన్య అన్నారు. దీనిపై డీపీఓ స్వరూపారాణి మాట్లాడుతూ తమకు గత మూడు రోజుల కిందటే ఈ పనుల కోసం సమాచారం వచ్చిందని, వాస్తవానికి ఈ పనులకు గ్రామ తీర్మానాలు అవసరమని, అవ్వగానే పనులు చేసుకోవచ్చునని బదులిచ్చారు.

జెడ్పీ నిధులతో చేయాల్సిన పనులకు ఇలాంటి అడ్డంకులేంటని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ కూడా ప్రశ్నించారు. దీనిపై ఆమదాలవలస ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌ జోక్యం చేసుకుంటూ.. అనవసర రాజకీయాలు మాట్లాడొద్దని, జెడ్పీ నిధులతో పనులెక్కడా తాము గానీ తమ పార్టీ నేతలు గానీ ఆపడం లేదన్నారు. దీనిపై సరుబుజ్జిలి జెడ్పీటీసీ నాగేశ్వరరావు స్పందిస్తూ ‘మీరు కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో పనులు అడ్డుకుంటున్నారు కదా..’ అంటూ బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే రవి ఊగిపోతూ ‘నీకు అవగాహన తక్కువ.. ప్రేలాపన ఎక్కువ’ అంటూ ఏకవచన ప్రయోగం చేశారు. ఉపాధి హామీ పథకం ని«ధులతో చేయాల్సిన పనులకు జెడ్పీ నిధులతో చేయొద్దని అన్నారు. అయితే నరసన్నపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ విషయాల్లో అవగాహన లేదని అర్థమైందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటివి జరగకుండా క్లాస్‌ తీసుకుంటానన్నారు.  

జెడ్పీటీసీ సురవరపుని నెట్టివేస్తున్న కూన రవి 
పింఛన్లపై రభస 
సమావేశంలో పింఛన్ల ప్రస్తావన రావడంతో ఒక్కసారిగా సమావేశం వేడెక్కింది. వైఎస్సార్‌ సీపీ గ తంలో లక్షలాది పింఛన్లు తొలగించేసిందని ఎమ్మెల్యే కూన రవి ప్రస్తావించగా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు కృష్ణచైతన్య, నాగేశ్వరరావు, దువ్వాడ వాణి, పాల వసంతరావు, దుబ్బ వెంకట రమణ, టొంపల సీతారాం తదితరులు ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పింఛన్లు ఎన్నో చెప్పాలని పట్టుబట్టారు. 

50 ఏళ్లు దాటిన వారికి పింఛను హామీ ఏమైందని కృష్ణచైతన్య గుర్తుచేశారు. అలాగే తమ నియోజవర్గంలో అన్యాయంగా పింఛన్‌ నిలిపివేసినందుకు బాధితుడు కోర్టును ఆశ్రయిస్తే పింఛన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. దీనిపై ఎమ్మెల్యే రవి మాట్లాడుతూ పింఛన్లపై రాద్ధాంతం చెయ్యొద్దని, జగన్‌ రూ.3 వేల చొప్పున మూడు నెలలే పింఛను ఇచ్చారని ఎద్దేవా చేశారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు స్పౌజ్‌ మాత్ర మే ఇచ్చామని, త్వరలో కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.  

జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశమివ్వరా..? 
స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీటీసీలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వకుండా ఎంతసేపు ఎమ్మెల్యే రవికుమార్‌ మాత్రమే మాట్లాడి అధికారులను బెదిరించేస్తే సరిపోతుందా మా సమస్యలు చెప్పనివ్వరా.. ఇదే ఆఖరి స్థాయీ సంఘ సమావేశం, ఇందులో కూడా మాకు కనీసం మాట్లాడనివ్వరా.. అంటూ పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే రవికుమార్‌ జోక్యం చేసుకుంటూ తాను కూడా సభ్యుడినేనని, తనకు కూడా మాట్లాడే హక్కు ఉందని, మీరంతా ఆఫ్‌ట్రాల్‌ జెడ్పీటీసీలని, తాను ఎక్కడైనా మాట్లాడగలనని గట్టిగా వాదనకు దిగారు. 

దీనిపై టెక్కలి జెడ్పీటిసీ దువ్వాడ వాణి స్పందిస్తూ రవికుమార్‌కు మాట్లాడటానికి అవకాశం ఇవ్వొద్దని జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయకు కోరారు. జెడ్పీటీసీలకు మాట్లాడకుండా అవకాశాలు ఇవ్వకపోతే ఎలా జెడ్పీటీసీల కోరం ఉంటేనే సభ జరుగుతుందనే విషయాన్ని మరిచిపోవద్దని మండిపడ్డారు. అనంతరం జెడ్పీటీసీలు ధర్మాన కృష్ణ చైతన్య, దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరమణ, పాల వసంతరావు, నాగేశ్వరరావు తదితరులంతా సమావేశం ముగియకుండానే వెళ్లిపోయారు.  

నరసన్నపేటలో పోటీ చేస్తా నీ సంగతి చూస్తా.. 
స్థాయీ సంఘ సమావేశాల వేదికలో ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్, జెడ్పీటీసీలపై విరుచుకుపడ్డారు. ముందుగా సరుబుజ్జిలి జెడ్పీటీసీ నాగేశ్వరరావుపై పనుల అడ్డగింత అంశంలో «ధ్వజమెత్తుతూ ‘నాగేశ్వరరావు.. జాగ్రత్త. సంగతి చూస్తా..’ అంటూ మీసం మెలేశారు. అనంతరం పింఛన్ల అంశంలో పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్యపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ‘చైతన్య.. నువ్వు రెచ్చిపోతున్నావ్‌. నా సంగతి తెలియదు.

 మీ నాన్న, చిన్నాన్నలకే లెక్కచెయ్యను నేను. నువ్వెంత. నీకు అంత కోరికుంటే నేనే నరసన్నపేటలో పోటీ చేస్తా.. అప్పుడు నీ సంగతి తేల్చుతా.’ అంటూ రవి కుమార్‌ ఊగిపోయారు. దీనిపై కృష్ణ చైతన్య మాట్లాడుతూ ‘రండి.. నరసన్నపేటలో సర్పంచ్‌ స్థాయి వారిని మీపై నిలబెట్టి గెలిపించి మా దమ్ము ఏంటో చూపిస్తాం’ అంటూ సమాధానమిచ్చారు. వాదన ముదరడంతో జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయ ఆదేశాలతో మైక్‌ కట్‌ చేయించారు.  

ఒంటరి మహిళలకు అవమానం  
పింఛను ఇస్తామని ఒంటరి మహిళలతో నరసన్నపేట టీడీపీ కార్యకర్తలు, నేతలు అను చితంగా వ్యవహరిస్తున్నారని పోలాకి జెడ్పీటిసీ కృష్ణచైతన్య ధ్వజమెత్తారు. దీనిపై ఎమ్మెల్యే రవి కుమార్‌ స్పందిస్తూ మీ ఆగడాలు తెలుసు అంటూ.. పరుష వ్యాఖ్యలు చేశారు. కృష్ణచైతన్య సమాధానమిస్తూ ‘మీరు చేసినవన్నీ మావాళ్లు చేశారని చెబుతున్నారు’ అంటూ సీటు నుంచి లేచి కూన రవికి ఆధారాలు చూపించే ప్రయత్నం చేశారు. ‘నీ సీట్‌లో కూర్చుని మాట్లాడు’ అంటూ ఏకవచన ప్రయోగంతో కూన రవి వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఒకరినొకరు నెట్టుకునేలా పరిస్థితి పెరిగింది. నల్ల కండువ ధరించిన కృష్ణచైతన్యపై ఎమ్మెల్యే రవి మైక్‌ కిందకు పడేసి మరీ మీదమీదకు వెళ్లేలా ప్రవర్తించడంపై జెడ్పీటీసీలు, అధికారులు కూడా చర్చించుకున్నారు. 

చదవండి: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement