కాక్రోచ్‌ పార్టీలో తిరుగుబాటు.. ‘కేజ్రీవాల్‌ టీమ్‌’ అంటూ కొత్త పార్టీ! | Manish Brahmbhatt Rebels Against CJP Launches CJP D | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌ పార్టీలో తిరుగుబాటు.. ‘కేజ్రీవాల్‌ టీమ్‌’ అంటూ కొత్త పార్టీ!

Sep 4 2026 7:27 AM | Updated on Sep 4 2026 7:27 AM

Manish Brahmbhatt Rebels Against CJP Launches CJP D

జెన్‌జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాక్రోచ్‌ జనతా పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ మాజీ వలంటీర్‌ మనీష్‌ బ్రహ్మభట్‌ సంచలన ఆరోపణలకు దిగారు. అసలు ఉద్యమ స్ఫూర్తికి సీజేపీ దూరమైందని, నిరసనల్లో పాల్గొన్న క్రియాశీలక వలంటీర్లను పక్కనపెట్టి కొందరితోనే పార్టీని నడుపుతున్నారని అన్నారు. అలాగే సీజేపీ నాయకత్వం రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారని అన్నారు. ఈ క్రమంలో కాక్రోచ్‌ జనతా పార్టీ-డెమోక్రటిక్‌ (CJP-D) పేరుతో కొత్త వేదికను ప్రకటించారు. 

గురువారం ఢిల్లీలో మనీష్‌ బ్రహ్మభట్‌ కొత్త పార్టీని ప్రకటించారు. కాక్రోచ్‌ జనతా పార్టీ తో సంబంధం లేకుండా సీజేపీ-డెమోక్రటిక్‌ పేరుతో ఇక తాను పోరాటం చేస్తానని అన్నారు. అభిజీత్‌ దీప్కే నేతృత్వంలోని సీజేపీ నాయకత్వం ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), దాని కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు అనుకూలంగా మారిందని ఆయన విమర్శించారు. పార్టీని ‘టీమ్‌ కేజ్రీవాల్‌’గా మార్చేశారని ఆరోపిస్తూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజల సమస్యలపై పోరాడటానికి బదులుగా బీజేపీని వ్యతిరేకించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దీప్కే సహా సీజేపీలోని ఎనిమిది మంది నాయకులకు ఆప్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని అన్నారాయన.

మనీష్‌ బ్రహ్మభట్‌ గుజరాత్‌లో మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. అలాగే, 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పాలన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 964 ఓట్లు సాధించారు. సీజేపీ ఉద్యమంలో గుజరాత్‌ నుంచి వలంటీర్‌, కోఆర్డినేటర్‌గా పనిచేశారు. అయితే నీట్‌ నిరసనల తర్వాత.. ఆగస్టు మొదటి వారంలో సీజేపీ కోర్‌ టీమ్‌ సమావేశం జరిగింది. దానికి మనీష్‌కు ఆహ్వానం వెళ్లలేదు. మహారాష్ట్రలోని అభిజీత్‌ దీప్కే నివాసంలో(ఛత్రపతి శంభాజీనగర్‌కు) ఈ మీటింగ్‌ జరుగుతోందని మీడియా ద్వారా తెలుసుకుని బ్రహ్మభట్‌ అక్కడికి వెళ్లారు. అయితే ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. 

దీప్కే నివాసంలోకి అనుమతించకపోవడంతో.. మనీష్‌ అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. జంతర్‌మంతర్‌ ఉద్యమంలో పాల్గొన్న పలువురు వలంటీర్లను కీలక చర్చలకు.. అదీ ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో బ్రహ్మభట్‌, ఆయన సహచరుడు రాహుల్‌ పాండ్యా ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీజేపీని తాను వీడుతున్నట్లు ఆయన ప్రకటించి.. ఇప్పుడు కొత్త వింగ్‌ ప్రకటించారు. 

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కాక్రోచ్‌ కామెంట్ల నేపథ్యంతో.. మే 16న అభిజీత్‌ దీప్కే CJPని తొలుత వ్యంగ్యాత్మక ఆన్‌లైన్‌ ఉద్యమంగా ప్రారంభించారు. కానీ, అదే యువత వేదికగా మారింది. నిరుద్యోగం, పరీక్ష పేపర్‌ లీకులు, విద్యా వ్యవస్థలో అక్రమాల వంటి అంశాలను ఈ వేదిక ప్రస్తావించింది. అయితే సీజేపీ ఆవిర్భావం నుంచే అభిజిత్‌ దీప్కేకు, ఆప్‌కు సంబంధాలు ఉన్నాయనే చర్చా నడిచింది. జంతర్‌మంతర్‌ నిరసనల్లోనూ కేజ్రీవాల్‌ సహా ఆ పార్టీ నేతలు హాజరై సంఘీభావం తెలపడమూ తెలిసిందే. 

అభిజీత్‌ దీప్కే 2020 నుంచి 2023 వరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సోషల్‌ మీడియా, ఎన్నికల ప్రచార బృందంలో పనిచేశారు. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్‌లు, డిజిటల్‌ కంటెంట్‌ ద్వారా పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. 2023లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తర్వాత ఆప్‌తో తన అనుబంధం ముగిసిందని దీప్కే ఇదివరకే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు బ్రహ్మభట్‌ చేసిన ఆరోపణలకు సీజేపీ నుంచి ఎలాంటి సమాధానం ఇంకా రాలేదు.

ఇదీ చదవండి: అగ్రనేతల ఆమోదంతోనే.. ఆమె తొలగింపు జరిగిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement