కొండా సురేఖ వ్యవహారాన్ని సోనియా,రాహుల్‌గాందీలకు చేరవేసిన ఖర్గే, కేసీ వేణుగోపాల్
సురేఖ వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమె బర్తరఫ్‌కు గ్రీన్‌సిగ్నల్
బర్తరఫ్ అనంతర పర్యవసానాలపై పీసీసీ చీఫ్,డిప్యూటీ సీఎంలతో సీఎం చర్చలు
ఢిల్లీలోనే బర్తరఫ్, మూడు నియామకాలపై మంత్రాంగం
ఒక వర్గాన్నే టార్గెట్ చేశారనే నిందను తప్పించుకునేందుకు చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్‌తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
మూడ్రోజులుగా తర్జనభర్జనలు..
సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.
దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి.
సోనియా, రాహుల్‌కు కేసీ సమాచారం
బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్‌లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు.
కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’
ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.
సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు
సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది.
రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్‌గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు.


