బీజేపీ సెక్రటేరియట్‌ ముట్టడి ఉద్రిక్తం | Tension prevails during BJP obsession of the Secretariat | Sakshi
Sakshi News home page

బీజేపీ సెక్రటేరియట్‌ ముట్టడి ఉద్రిక్తం

Sep 4 2026 2:01 AM | Updated on Sep 4 2026 2:01 AM

Tension prevails during BJP obsession of the Secretariat

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణ, మహేశ్వర్‌రెడ్డి తదితరుల అరెస్ట్‌ 

ఫీజు బకాయిలపై సీఎంకు వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం...అడ్డుకున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు నేతృత్వంలో చేపట్టిన సెక్రటేరియట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మెయిన్‌ గేటు వద్ద రాంచందర్‌రావుతో పాటు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్‌.గౌతంరావు, బండారు విజయలక్ష్మి, బీజైవైఎం అధ్యక్షుడు గణేష్‌ కుండే తదితరులను అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు, పార్టీకార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

కొన్నిరోజుల క్రితం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిల చెల్లింపు విషయంలో విద్యార్థుల వినతిపత్రాల సమర్పణకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ను రాంచందర్‌రావు కోరారు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చలో సెక్రటేరియట్‌కు బయలుదేరారు. 

సెక్రటేరియల్‌ మెయిన్‌గేట్‌ వద్దకు వారు చేరుకోగానే పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రాంచందర్‌రావు, ఇతరనేతలు, కార్యకర్తలను తోపులాట మధ్య పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఫీజు బకాయిలు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని మండిపడ్డారు. తాను ఇప్పటికే, ఈ అంశంపై రెండురోజుల నిరాహార దీక్ష చేశానని, సీఎంకు లేఖలు రాశానని గుర్తుచేశారు. విద్యార్థుల సహనం నశించడంతోనే వారి గొంతు కగా మారి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 

ఫీజు బకాయిలన్నీ విడుదల చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్‌ రాజీనామా చేసి,గద్దె దిగాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న తనను పోలీసులు అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేశారని మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఫీజు పోరుపై బీజేపీ సచివాలయ మెరుపు ము ట్టడి అద్భుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీ నాయకుల అరెస్ట్‌ను పార్టీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్‌ గౌడ్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్విసుభాష్‌ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement