స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన అనంతరం దానిపై ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు
రూ. 620 కోట్లతో నిర్మించిన నల్లగొండ క్రాస్‌రోడ్స్ స్టీల్ బ్రిడ్జి ప్రారంబోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
చాంద్రాయణగుట్ట మెట్రో మార్గాన్ని తదుపరి ఎన్నికల్లోగా అందుబాటులోకి తెస్తామని వెల్లడి
హైదరాబాద్ అభివృద్ధికి హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపు
అసదుద్దీన్, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు... దేశభక్తిలో మోదీ, అమిత్ షాకన్నా ఒవైసీ తక్కువేమీ కాదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్/చంచల్‌గూడ/చార్మినార్: ఓల్డ్ సిటీ (ఒరిజినల్ సిటీ) సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మెట్రో మార్గం పనులను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ మార్గాన్ని పూర్తిచేసి మెట్రోలోనే వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ క్రాస్‌రోడ్స్–ఒవైసీ జంక్షన్ వరకు రూ. 620 కోట్లతో సిగ్నల్ ఫ్రీగా జీహెచ్‌ఎంసీ నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించారు. అనంతరం చంచల్‌గూడ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
హిందూ, ముస్లింలు కలిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
చాంద్రాయణగుట్ట మెట్రో కోసం భూసేకరణ దాదాపు పూర్తయిందని.. మెట్రో పనులను వేగంగా చేపట్టి తదుపరి ఎన్నికల్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ వంతెనకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టడం తప్ప రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేసిందన్నారు.
నాగోలు నుంచి ఎల్బీనగర్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. ఉభయులూ కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీ వంటి ప్రాజెక్టుల ద్వారా పేద ముస్లింలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అభివృద్ధికి బీజేపీ, బీఆర్‌ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. మిగతా సమయంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు, వర్గాలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. ఓల్డ్ సిటీని ఒరిజినల్ సిటీగా మరోమారు పేర్కొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇక్కడి ప్రతి వీధి, సందు తనకు తెలుసన్నారు. గత 70 ఏళ్లలో 18 మంది సీఎంలు పనిచేసినా చంచల్‌గూడకు రాలేదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు.
ఎవరి ధమ్కీలకూ బెదరను.. ప్రేమకే లొంగుతా..
‘నేను బెదిరిస్తే భయపడను. ఎవరి ధమ్కీలకూ బెదరను. ప్రేమకే లొంగుతా. స్నేహంతోనే నన్ను గెలవగలరు. నేను దోస్తీకి మాత్రమే గులామ్‌ను. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. గెలుపోటములు సహజం’అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమని కొందరు దుషŠప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఆపరేషన్‌న్‌సిందూర్ సమయంలో దేశం పక్షాన నిలిచిన అసదుద్దీ¯న్Œ ఒవైసీని అభినందించారు.
ఈ అంశంలో అసద్.. మోదీ, అమిత్ షాల కంటే తక్కువేమీ కాదన్నారు. మీరాలం చెరువు వద్ద 3 కి.మీ. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. మెట్రో రెండో దశలో నాగోల్ నుంచి ఎల్బీ నగర్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని అభివృద్ధి ప్రతిపాదనలు తెచ్చినా మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, రాజ్యసభ ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్‌కుమార్ యాదవ్, దానం నాగేందర్, జాఫర్ మెరాజ్ హుస్సేన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి కాదు.. రేవంత్‌కే మా మద్దతు: అసదుద్దీన్ ఒవైసీ
‘ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ నాయకుల అందరి ముందు చెబుతున్నా. మా పార్టీ మద్దతు కాంగ్రెస్‌కు కాదు.. కేవలం రేవంత్‌రెడ్డికే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన మాట వాస్తవం. కానీ ప్రజావ్యతిరేక పనులను ఆపాలని.. లేకపోతే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని చెప్పా.. అలాగే జరిగింది. ప్రస్తుతం రేవంత్ సైతం ప్రజల్లోకి రావట్లేదు. అందుకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలియదు’అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.
రాష్ట్రం వెలుపల ఏదైనా మాట్లాడొచ్చని.. కానీ రాష్ట్రంలో మాత్రం తమకు వ్యతిరేకంగా మాట్లాడవద్దన్నారు. కాగా, చంచల్‌గూడ మైదానంలో ఉన్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేయాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సీఎంకు వినతిపత్రం ఇవ్వగా రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.


