శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి వేటాడే డ్రోన్
‘ఆహుతి మార్క్–2’డ్రోన్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్ స్టార్టప్
దక్షిణ ఆసియాలోనే అత్యధిక వేగ పరిమితి నమోదు
మొదటి తరం ‘ఆహుతి’డ్రోన్ అందుకున్నది 300కి.మీ వేగమే
దీని వేగం గంటకు 498కి.మీ.. సరిహద్దు రక్షణలో సరికొత్త విప్లవం...
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో రూపకల్పన
భారత రక్షణ రంగ సాంకేతికతలో హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త చరిత్ర లిఖించింది. శత్రువుల డ్రోన్ దాడులను గగనతలంలోనే అత్యంత వేగంగా తిప్పికొట్టే ’ఆహుతి మార్క్–2’ ఎలక్ట్రిక్ మల్టీరోటర్ డ్రోన్ ఇంటర్‌సెప్టర్‌ను అపొలియాన్ డైనమిక్స్(డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ)తయారు చేసింది. ఈ డ్రోన్ గంటకు 498 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును అధికారికంగా నమోదు చేసుకుంది.
తద్వారా దక్షిణ ఆసియాలోనే అత్యధిక వేగ పరిమితిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఈ స్టార్టప్ 2025లో ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి నేతృత్వంలో ఈ సాంకేతికత రూపుదిద్దుకుంది. అమన్ విరానీ, మానస్ విచారే, ఇషాన్ సూరిలతో కూడిన ప్రతిభావంతమైన బృందం ఈ రికార్డు స్థాయి డ్రోన్‌ను రాత్రింబగళ్లు కష్టపడి అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హై–స్పీడ్ డ్రోన్ పైలట్ అయిన అమన్ విరానీ ఈ డ్రోన్ ప్రయోగాత్మక పరీక్షల్లో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
పాత రికార్డులు బద్దలు..
గతంలో భారతదేశంలో మల్టీరోటర్ డ్రోన్ల గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా నమోదైంది. అయితే ఆహుతి మార్క్–2 ఆ పాత రికార్డును భారీ వ్యత్యాసంతో అధిగమించింది. 2025లో రూపొందించిన మొదటి తరం ’ఆహుతి’ డ్రోన్ గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగింది. కేవలం ఒకే సంవత్సరంలో ఈ బృందం పాత నమూనాను పూర్తిగా ప్రక్షాళన చేసి, సరికొత్త సాంకేతికతతో పునర్నిర్మించింది. దీనివల్ల డ్రోన్ వేగం ఏకంగా 66 శాతం పెరిగి గంటకు 498 కిలోమీటర్లకు చేరుకుంది. దక్షిణ ఆసియాలోనే ఇంతటి వేగవంతమైన మల్టీరోటర్ డ్రోన్ మరొకటి లేదని కంపెనీ చెబుతోంది. డ్రోన్ ఇంటర్‌సెప్టర్ అంటే శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి, వాటిని అడ్డుకుని, నాశనం చేసే ఒక అధునాతన రక్షణ వ్యవస్థ. సరళంగా> చెప్పాలంటే డ్రోన్‌లను వేటాడే మరో డ్రోన్ లేదా మిస్సైల్ అన్నమాట.
యుద్ధ వ్యూహాలలో మార్పులు..
ప్రస్తుత ఆధునిక యుద్ధాలలో తక్కువ ఖర్చుతో కూడిన ‘షాహెద్’రకానికి చెందిన డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇటువంటి చౌకబారు శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు లక్షల రూపాయల విలువైన ఖరీదైన క్షిపణులను ఉపయోగించడం ఆర్థికంగా భారం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే అపొలియాన్ డైనమిక్స్ ఈ అత్యాధునిక ఇంటర్‌సెప్టర్‌ను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో వేగమే అత్యంత కీలకమని, గంటకు 498 కిలోమీటర్ల వేగంతో తాము ఏ రకమైన వైమానిక ముప్పునైనా సమర్థవంతంగా అడ్డుకోగలమని సంస్థ వ్యవస్థాపకులు ధీమా వ్యక్తం చేశారు.
సైన్యానికి సరఫరా..
ఈ అసాధారణ వేగాన్ని అందుకోవడానికి డ్రోన్ ఫ్రేమ్, ప్రొపల్షన్ వ్యవస్థ, మోటార్ల అమరికను సుమారు పది సార్లు పునఃసమీక్షించి మార్పులు చేశారు. ఈ డ్రోన్ ప్రయాణించే సమయంలో ఒకేసారి 400 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని గ్రహిస్తుంది. ఇదే దీని వేగానికి ప్రధాన కారణం. భారత సైన్యం సహకారంతో బాబినా, గోపాల్‌పూర్ వంటి సైనిక ఫైరింగ్ కేంద్రాలలో ఈ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటికే ఈ సంస్థ భారత సైన్యానికి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కామికేజ్ డ్రోన్లను సరఫరా చేసింది.
క్రూజ్ క్షిపణి లక్ష్యంగా..
ప్రమాదకర సరిహద్దు ప్రాంతాలలో మానవ రహిత వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా సైనికుల ప్రాణాలను కాపాడటమే కంపెనీ ముఖ్య ఉద్దేశం. అగ్ని క్షిపణి కార్యక్రమానికి మాజీ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎం.రామ మనోహర బాబు ప్రస్తుతం ఈ సంస్థ సలహా మండలిలో సేవలందిస్తున్నారు. ఈ సంస్థ 2032 నాటికి వేలాది కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల భారీ పవర్ క్రూజ్ క్షిపణి ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


