హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తు‍న్నారా? | Hyderabad traffic advisory and diversions | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తు‍న్నారా?

Sep 3 2026 6:59 PM | Updated on Sep 3 2026 7:28 PM

Hyderabad traffic advisory and diversions

హైదరాబాద్: అబిడ్స్‌లోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఆ ఆలయ యాజమాన్యం నిర్వహించనున్న "శ్రీ కృష్ణాష్టమి మహోత్సవం" సందర్భంగా.. భక్తుల రద్దీ, రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబరు 4 తెల్లవారుజామున 4 గంటల నుంచి సెప్టెంబరు 5 అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయి.

ఈ దారుల్లో వెళ్లొద్దు
యూసుఫ్ & కంపెనీ, జవహర్‌లాల్ నెహ్రూ రోడ్డు, అబిడ్స్ సర్కిల్, పాత హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్, చిరాగ్ అలీ లేన్, నాంపల్లి స్టేషన్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు వీలైనంత వరకు ఈ దారుల్లో వెళ్లొద్దు.

ట్రాఫిక్ మళ్లింపులు
భక్తుల రాకపోకలు, అప్పటి ట్రాఫిక్ పరిస్థితులను బట్టి అబిడ్స్ ఇస్కాన్ ఆలయ సమీపంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. గన్‌ఫౌండ్రీ, తిలక్ రోడ్ జంక్షన్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను జిపిఓ (GPO) జంక్షన్ వద్ద 'హాట్ అండ్ గో' పద్ధతిలో నియంత్రిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. జాంబాగ్ రోడ్ , ఎస్.ఎ. బజార్ మసీదు నుండి జిపిఓ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కూడా 'హాట్ అండ్ గో' పద్ధతిలోనే నియంత్రిస్తారు. 

రద్దీ పెరిగితే జిపిఓ జంక్షన్ వైపు అనుమతించకుండా ఎంజే మార్కెట్ వద్ద గాంధీ భవన్, చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు. నాంపల్లి తాజ్ ఐలాండ్ నుండి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సాధారణ మార్గమైన భారత్ పెట్రోల్ పంప్ వద్ద ఎడమ మలుపు తీసుకుని, సమాచార హక్కు భవన్ (పాత ఎసిబి లేన్), యూసుఫ్ & కంపెనీ, ట్రూప్ బజార్ మీదుగా కోటి బ్యాంక్ స్ట్రీట్ వైపు అనుమతిస్తారు. అలాగే బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చే ట్రాఫిక్‌ను పాత హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వైపు అనుమతించకుండా, ఎంజే మార్కెట్ రోడ్ వైపు మళ్లిస్తారు.

ఆర్టీసీ (RTC) బస్సుల మళ్లింపులు
ఇస్కాన్ ఆలయ పరిసర మార్గాల గుండా వెళ్లే ఆర్టీసీ బస్సులను భక్తుల రద్దీ ఆధారంగా మళ్లిస్తారు. రంగమహల్ , జాంబాగ్ రోడ్ నుండి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద కుడివైపు ఉన్న జిపిఓ జంక్షన్ లేదా అబిడ్స్ సర్కిల్ వైపు వెళ్లనివ్వకుండా, గాంధీ భవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ జాంబాగ్ వద్ద ఆర్టీసీ కంట్రోలర్ విధి నిర్వహణలో ఉంటారు). ఎస్.ఎ. బజార్ మసీదు లేదా అఫ్జల్‌గంజ్ నుండి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద నేరుగా జిపిఓ జంక్షన్ వైపు వెళ్లనివ్వకుండా, గాంధీ భవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ ఎస్.ఎ. బజార్ వద్ద కంట్రోలర్ ఉంటారు). 

లిబర్టీ, బషీర్‌బాగ్ నుండి వచ్చే బస్సులను బిజేఆర్ సర్కిల్ వద్ద జిపిఓ జంక్షన్ వైపు అనుమతించకుండా, ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ బిజేఆర్ సర్కిల్ వద్ద కంట్రోలర్ ఉంటారు). రవీంద్ర భారతి లేదా హెచ్‌టిపి జంక్షన్ నుండి వచ్చే బస్సులను ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద ఎడమవైపు బిజేఆర్ సర్కిల్ వైపు వెళ్లనివ్వకుండా, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద కంట్రోలర్ విధి నిర్వహణలో ఉంటారు).

పార్కింగ్ ఏర్పాట్లు, సూచనలు
అబిడ్స్ ఇస్కాన్ ఆలయానికి విచ్చేసే భక్తుల వాహనాల కోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీకి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626కు ఫోన్‌ చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement