సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతలు తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో ఉనికిని కాపాడుకోవడానికే ఒకరిని మించి ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నిజంగా తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నేతలపై ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు ఏ విధంగా మంజూరవుతున్నాయో తెలంగాణ విషయంలో ఎందుకు అదే విధానం అమలు కావడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే తమ ఉనికిని కాపాడుకోగలమని, పార్టీ అధిష్టానం తమను గుర్తిస్తుందని భావించడం సరికాదన్నారు.
ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన బీజేపీ నేతలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ, పాత బకాయిలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన అనేక హామీలు, నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని మంత్రి అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం కేంద్రానికి వెళ్తున్నప్పటికీ, తిరిగి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు, రీజినల్ రింగ్ రోడ్‌కు సంబంధించిన అంశాలు సహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద రాష్ట్ర హక్కులను సాధించడంలో బీజేపీ నేతలు ముందుకు రావాలని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ తీసుకురావాలని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ప్రశ్నించండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే దమ్ము చూపించండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.


