రోజువారీ కూలీకి నిమ్స్‌లో ఉచిత వైద్యం.. కోలుకున్న రోగి
లక్డీకాపూల్: గుండె లయ తప్పుతుండటం వల్ల రెండేళ్లుగా ఛాతీ నొప్పి, ఆయాసంతో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల రోజువారీ కూలీకి నిమ్స్ వైద్యులు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అత్యాధునిక, అత్యంత క్లిష్టమైన వైద్య ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడం ద్వారా గుండె తిరిగి లయబద్ధంగా కొట్టుకొనేలా చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో రోగితో కలిసి నిమ్స్ కార్డియాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఒ.సాయి సతీశ్ ఈ వివరాలు వివరించారు. రోగి వివిధ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోగా అతని ఈసీజీలో తరచూ వెంట్రిక్యులర్ ప్రీమెచ్యూర్ కాంప్లెక్సెస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారని.. మందులు వాడినా ఫలితం లేకపోగా, గుండె సంకోచ సామర్థ్యం కూడా పడిపోయిందని చెప్పారు.
దీంతో అతను నిమ్స్‌ను ఆశ్రయించినట్లు డాక్టర్ సాయి సతీశ్ చెప్పారు. దీంతో రోగికి హోల్టర్ మానిటరింగ్ పరీక్ష నిర్వహించగా అతని గుండెలో 57 శాతం అసాధారణ విపరీత స్పందనలు ఉన్నట్లు తేలిందన్నారు. దీంతో గత నెల 24న అతనికి 3డీ మ్యాపింగ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియను నిర్వహించామన్నారు. రోగి గుండెలో అసాధారణ విద్యుత్ సంకేతాల కేంద్రం బృహద్ధమని కవాటంలోని ఎడమ కరోనరీ కస్ప్ కింద భాగంలో, ఎడమ కరోనరీ ధమనికి అత్యంత సమీపంలో ఉన్నట్లు గుర్తించామన్నారు.
వాస్తవానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్రక్రియ అత్యంత ప్రమాదకరమని.. చికిత్సలో ఏమాత్రం తేడా వచ్చినా ఎడమ కరోనరీ ధమనికి గాయమయ్యే ప్రమాదం ఉంటుందని సతీశ్ చెప్పారు. ఈ నేపథ్యంలో తమ వైద్య బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యకు కారణమైన అసాధారణ విద్యుత్ కేంద్రాన్ని విజయవంతంగా అబ్లేట్ చేయడంతో గుండె లయ సాధారణ స్థితికి వచ్చిందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ ఖర్చుతో కూడుకున్న ఆధునిక ఈపీఎస్, ఆర్‌ఎఫ్‌ఏ చికిత్సను ఆరోగ్యశ్రీ కింద రోగికి ఉచితంగా అందించామన్నారు.


