బాలల రక్షణకు సమష్టి కార్యాచరణ | Chief Justice AK Singh at Judicial Academy event | Sakshi
Sakshi News home page

బాలల రక్షణకు సమష్టి కార్యాచరణ

Sep 4 2026 1:55 AM | Updated on Sep 4 2026 1:55 AM

Chief Justice AK Singh at Judicial Academy event

కార్యక్రమంలో సీజే జస్టిస్‌ ఏకే సింగ్, జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, డీజీపీ సీవీ ఆనంద్‌

జువెనైల్‌ జస్టిస్‌ చట్టం సమర్థ అమలు అనివార్యం 

జ్యుడీషియల్‌ అకాడమీ కార్యక్రమంలో చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ 

చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టులతో ఉపశమనమన్న జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య

సాక్షి, హైదరాబాద్‌: జువెనైల్‌ జస్టిస్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే న్యాయవ్యవస్థ, పోలీసు, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ సూచించారు. ఇది ఏ ఒక్క శాఖ బాధ్యతగా కాకుండా.. బాలల భవిష్యత్‌కు సంబంధించిన సామాజిక బాధ్యతగా చూడాలన్నారు. పోక్సో చట్టం కూడా బాలల న్యాయ వ్యవస్థతో ముడిపడి ఉన్నందున అన్ని భాగస్వామ్య సంస్థల మధ్య సమన్వయం మరింత అనివార్యమన్నారు. 

గురువారం జువెనైల్‌ జస్టిస్‌పై జ్యుడీషియల్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఏకే సింగ్‌ మాట్లాడుతూ.. ‘బాలల సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే గుర్తించి నివారించడమే సమర్థ బాలల న్యాయ వ్యవస్థకు పునాది. బాలల సంరక్షణ గృహాలు భోజనం పెట్టే కేంద్రాలుగా ఉండకూడదు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, సంస్కరణ కేంద్రాలుగా పనిచేయాలి’అని వివరించారు.  

స్వయంగా ఎదిగేలా చర్యలు చేపట్టాలి.. 
జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ.. రక్షణ, పునరావాసంతోపాటు పిల్లలు భవిష్యత్తులో స్వయం ఆధారితులుగా, సమర్థవంతమైన వ్యక్తులుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారుల గౌరవాన్ని కాపాడటం, వారి అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత ముఖ్యమన్నారు. న్యాయ ప్రక్రియ.. బాధితులకు మరోసారి మానసిక గాయం కలిగించేలా ఉండకూడదని చెప్పారు. అవసరమైన చోట గోప్యంగా ప్రశ్నించడం, సింగిల్‌ రిఫ్లెక్టింగ్‌ మిర్ర ర్ల వంటి సదుపాయాలతో నిందితుడిని నేరుగా చూడకుండా సాక్ష్యమిచ్చే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.

 డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. 16–18 ఏళ్ల వారు ఘోర నేరానికి పాల్పడినప్పుడు అతడిని బాల నిందితుడిగానే పరిగణించాలా? లేక వయోజనుడిగా విచారించాలా? అనే అంశంపై జాతీయ స్థాయిలో మరోసారి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ సూరేపల్లి నందా,జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు, జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement