సీఎం సలహా మేరకు.. కొండా సురేఖ బర్తరఫ్‌ | Konda Surekha Bartaraf from CM Revanth Reddy Cabinet | Sakshi
Sakshi News home page

సీఎం సలహా మేరకు.. కొండా సురేఖ బర్తరఫ్‌

Sep 4 2026 2:04 AM | Updated on Sep 4 2026 2:04 AM

Konda Surekha Bartaraf from CM Revanth Reddy Cabinet

గురువారం రాత్రి లోక్‌భవన్‌లో గవర్నర్‌కు పుష్పగుచ్ఛాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్‌

సీఎం సలహా మేరకు మంత్రి పదవి నుంచి తప్పిస్తూ లోక్‌భవన్‌ బులెటిన్‌

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన 

సీఎం ఢిల్లీ నుంచి రాకమునుపే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన 

అంతకుముందే వీరిద్దరి తొలగింపునకు హైకమాండ్‌ ఆమోదం 

రాత్రి 8 వరకు కొనసాగిన ఉత్కంఠ 

గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను సీఎం కలిశాక సురేఖను తొలగించినట్టు లోక్‌భవన్‌ ప్రకటన 

ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు కట్టబెట్టిన ప్రభుత్వం 

చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్‌ విజయలక్ష్మి నియామకం 

మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా నేరెళ్ల శారద

‘కుడా’ చైర్‌ పర్సన్‌గా గుండు సుధారాణి 

మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ కులస్తులకు వ్యూహాత్మకంగా పదవులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రిమండలి నుంచి బర్తరఫ్‌కు గురయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి సైతం ఉద్వాసనకు గురయ్యారు. తక్షణమే వీరిద్దరిని ఆయా పదవుల నుంచి తొలగించాలని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు సీఎం రేవంత్‌ సిఫారసు చేశారని తెలిపింది. అయితే దీనిపై లోక్‌భవన్‌ గురువారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగింది. కానీ సీఎం..మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్‌తో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ వెంటనే లోక్‌భవన్‌ నుంచి బులెటిన్‌ జారీ అయింది. సీఎం రేవంత్‌ సలహా మేరకు కొండా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నట్టు బులెటిన్‌ వెల్లడించింది. కాగా చిన్నారెడ్డి తొలగింపు నేపథ్యంలో ఆ పదవిని భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం మరోరెండు కీలక నియామకాలు కూడా చేపట్టింది. 

రెండు వారాలుగా రాజకీయ దుమారం  
ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరు ప్రకాశ్‌రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. దీనిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డికి సీఎం కాగానే కళ్లు నెత్తికెక్కాయని, వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే పరకాలలో ఆయన తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని వనపర్తి టికెట్‌ను ఇచ్చారని జి.చిన్నారెడ్డి సైతం వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణ కమిటీ వీరిద్దరికి ఉద్వాసన పలకాలని సిఫారసు చేస్తూ అధిష్టానానికి నివేదిక సమర్పించింది. ఈ పర్యావసానాల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం, ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే సహా కొందరు పెద్దల్ని కలవడంతో  సురేఖతో పాటు జి.చిన్నారెడ్డిపై వేటు పడడం ఖాయమనే ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు సురేఖ కూడా మంగళవారం నాడే ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఖర్గే తదితరులతో సమావేశమై అదే రోజు రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. కాగా రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరడానికి ముందు..సురేఖ, చిన్నారెడ్డి విషయంలో సీఎంఓ కార్యాలయంనుంచి ప్రకటన వెలువడింది. అంతకుముందే వీరిద్దరి ఉద్వాసనకు పార్టీ హైకమాండ్‌ ఆమోదం తెలిపింది. 

గజిట్‌ జారీ చేసిన ప్రభుత్వం 
సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రధాన సలహాదారు కె.రామకృష్ణారావు గురువారం సాయంత్రం లోక్‌భవన్‌కు వెళ్లి సీల్డ్‌ కవర్‌లో మంత్రిమండలి నుంచి కొండా సురేఖ తొలగింపు ప్రతిపాదనను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చిన సీఎం.. వెంటనే చంచల్‌గూడ – సంతోష్‌నగర్‌ స్టీల్‌ బ్రిడ్జిని ప్రారంభించి, ఆ తర్వాత లోక్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ శుక్లాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సురేఖ తొలగింపుపై లోక్‌భవన్‌ బులెటిన్‌ జారీ చేసింది. సీఎం వెంట ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే రఘువీర్‌రెడ్డి ఉన్నారు. కాగా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గజిట్‌ వెలువరించింది. సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కొండా సురేఖ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. అంతకు ముందే కీలకమైన ఫైళ్లన్నీ సీఎస్‌ కార్యాలయంలో అప్పగించాలని ఆమె పీఎస్‌ను ఆదేశించారు. సురేఖను మంత్రిమండలి నుంచి తొలగించడంతో ఆమె వద్ద ఉన్న పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖలూ సీఎం పర్యవేక్షణ కిందికి వెళ్లాయి.  

వ్యూహాత్మకంగా మూడు నియామకాలు 
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ పదవి నుంచి జి.చిన్నారెడ్డిని తొలగించిన ముఖ్యమంత్రి తక్షణమే ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమార్తె, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ (మున్నూరుకాపు)ని నియమించారు. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (కుడా) చైర్మన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి (పద్మశాలి)ని రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తూ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద (గౌడ) నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే జారీ అయ్యాయి. కొండా సురేఖ ఇటీవల బీసీ అస్త్రాన్ని ఉపయోగించి సీఎం రేవంత్‌పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు, బీసీ వర్గాలకు న్యాయం చేశారనే సందేశాన్ని ఇవ్వడానికే వ్యూహాత్మకంగా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది.  
 
ఉద్వాసనకు గురైన మూడోమంత్రి సురేఖ 
తెలంగాణ రాష్ట్రంలో ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా కొండా సురేఖ చరిత్రకెక్కారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్‌ తాటికొండ రాజయ్యను అనూహ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తూ కేసీఆర్‌ 2015 జనవరి 25న నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖలో అవినీతి, స్వైన్‌ ఫ్లూ నివారణలో వైఫల్యాల నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌ రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈటల రాజేందర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమించారు. అయితే అసైన్డ్‌ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2021 మే నెలలో ఈటలకు ఉద్వాసన పలికారు. రేవంత్‌ మంత్రివర్గంలో 1,002 రోజుల పాటు మంత్రిగా కొనసాగిన సురేఖపై తాజాగా వేటు పడింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement