హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు.. తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్‌లో కలకలం రేపిన కరీంనగర్ యువకుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్‌పై గురువారం తీర్పు వెలువరించింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోగా, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ, పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్‌కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టులో శిక్ష పడిన నలుగురిని హైకోర్టు విడుదల చేస్తే, వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి, ఒకే వ్యక్తిపై హత్యానేరాన్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది.
ఈ కేసులో ఏం జరిగిందంటే...
జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు 2011 జూన్‌లో హైదరాబాద్‌కు వచ్చి అదృశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో, బాధితుడి తండ్రి లక్షన్నర రూపాయలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ఫ్లాట్‌లోని ఫ్రిజ్‌లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. హైకోర్టు శ్రీధర్ మినహా నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు.


