రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌... అందుకే ఉద్వాసన | Konda Surekha comments over revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌... అందుకే ఉద్వాసన

Sep 4 2026 2:10 AM | Updated on Sep 4 2026 2:10 AM

Konda Surekha comments over revanth reddy

నన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలనే ఆలోచన అధిష్టానానికి లేదు 

నన్ను తప్పించకపోతే తానే వెళ్లిపోతానని ముఖ్యమంత్రి అన్నారు.. 

మీడియాతో కొండా సురేఖ 

సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఎవరినీ సంప్రదించడం లేదు 

ప్రజలతో, నేతలతో వైఎస్సార్‌ ఉన్నట్లు రేవంత్‌రెడ్డి లేరు 

చంద్రబాబు వ్యవహరించినట్లే ఈయనా వ్యవహరిస్తున్నారు  

పొంగులేటి, వేం, సీఎం సోదరులు నాపై కుట్ర పన్నారు 

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడైనా స్పందించాలి.. ప్రభుత్వంలో ఏమి జరుగుతోందో చెప్పాలి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్టానాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని కొండా సురేఖ ఆరోపించారు. పార్టీ అధిష్టానానికి తనను తప్పించాలన్న ఆలోచన లేదని.. అయితే తనను తప్పించకపోతే..తాను వెళ్లిపోతానని సీఎం అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎవరితోనూ సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా కమ్యూనికేషన్‌ చేయడంలో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 

ప్రజలతో, నేతలతో వైఎస్సార్‌ ఉన్నట్లు రేవంత్‌రెడ్డి లేడన్నారు. తాము వైఎస్‌ రాజశేఖరరెడ్డిని అభిమానించనంతగా..రేవంత్‌రెడ్డిని అభిమానించామని చెప్పారు. రేవంత్‌రెడ్డిని నిందించిన వారంతా ఇప్పుడు మంచిగానే ఉన్నారని, కానీ తనను మాత్రమే రేవంత్‌రెడ్డి టార్గెట్‌ చేసుకున్నారని సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి మరికొందరు కుట్రపన్ని టార్గెట్‌ చేశారని ఆరోపించారు. 

అప్పట్లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పార్టీ హైకమాండ్‌కు ఇటీవల తాను రాసిన లేఖలను సురేఖ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. 

ప్రస్తుత పరిణామాలపై పశ్చాత్తాపం లేదు.. 
‘తమవైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు ఆయన వైపే చూపిస్తాయన్న అంశాన్ని రేవంత్‌ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యమంత్రిని నేను ఏనాడూ విమర్శించలేదు.. పార్టీని దూషించలేదు. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పదవుల కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. 

కొణిజేటి రోశయ్య, జైపాల్‌రెడ్డిలు ఇందిరాగాం«దీని నిందించిన వారే. జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే ఎలాంటి చర్యలు లేవు. నా కూతురు చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని నన్ను శిక్షించడం సరికాదు. ఉరి శిక్షపడిన ఖైదీని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ అధిష్టానం నా అభిప్రాయాలను తెలుసుకోకుండా సీఎం బ్లాక్‌మెయిల్‌కు లొంగి బర్తరఫ్‌ నిర్ణయం తీసుకుంది.  

మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా?  
మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చెప్పండి. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఏ పనులు జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నా. ప్రభుత్వంలో తప్పులు సరిదిద్దుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఆలోగా మనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. హామీలను అమలు చేసి చూపించాలి.  

కాంగ్రెస్‌లోనే ఉంటా... 
కాంగ్రెస్‌లోనే ఉంటా. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే. అది లేనంత మాత్రాన మాకు నష్టం లేదు. రెండు మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులం మాట్లాడుకుంటాం. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతా. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బర్తరఫ్‌ చేశారన్న సమాచారం ఇప్పుడే తెలిసింది. నా కూతురు ఇంగ్లండ్‌లో ఉంది. ఆమెతో, నా భర్తతోనూ ఇంకా చర్చించలేదు. నా కూతురు గౌరవం కోసమే ఆమె వ్యాఖ్యలపై నేను స్పందించలేదు.  

సుమంత్‌పై కేసులు విత్‌డ్రా చేసుకోవాలి 
నా ఓఎస్‌డీ సుమంత్‌ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయనను వెంటాడుతున్నారు. సుమంత్‌ ఎవరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి వెంటనే బెయిల్‌ ఇచ్చి.. 15 రోజుల తరువాత అదే వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. సుమంత్‌పై పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకోవాలని హోం శాఖను కోరుతున్నా. పరకాలలో సీఎం అక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్‌ ఎలా ప్రకటిస్తారు? 70 ఏళ్ల వృద్ధుడు.. వచ్చే ఎన్నికల నాటికి నడుస్తారో..మంచంపై ఉంటారో తెలియదు. నన్ను తొలగించిన నేపథ్యంలో బ్యాలెన్స్‌ చేయడానికి ముగ్గురు మహిళలకు పదవులు రావడం అభినందనీయం. వారికి నా శుభాకాంక్షలు. చిన్నారెడ్డిని నా కోసం శిక్షించడం సరికాదు..’అని సురేఖ అన్నారు.

పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇచ్చారన్న వారిని సన్మానించారు.. 
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికోసం రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించిన వారికి సీఎం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చి సన్మానించారు. డీఎస్‌ కుటుంబంలో ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో లేరా? పదేళ్లుగా నా కూతురికి ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇప్పించలేకపోయాం. అదే మొన్న పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ పదవి తెప్పించుకున్నారు. నా భర్తకు కనీసం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా ఇప్పించుకోలేదని నా కూతురు అన్నది. నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. వాటిని ఖండించాల్సిన లేదా సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. మేము నిబద్ధతతో రాజకీయాలు సాగిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదు. రాజీనామాలు చేసే ఇతర పార్టీలోకి వెళ్లాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement