సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు కీలకమైన ఈఓఎస్-05 (జీశాట్-1ఏ) ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
రెండో ప్రయోగ వేదిక నుంచి బయలుదేరిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17.. సరిగ్గా 18 నిమిషాల తర్వాత 3.13 గంటలకు 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (సబ్-జీటీఓ)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం 170 కి.మీ. పెరీజీ, 28,934 కి.మీ. అపోజీ(భూమికి అత్యంత దూరం) ఉన్న కక్ష్యలోకి చేరింది. సుమారు 51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్‌కు ఇది 19వ జీఎస్‌ఎల్‌వీ మిషన్.
ఇక ఈఓఎస్-05ను ఇస్రో సైంటిస్టులు ‘స్మార్ట్ బాయ్’ అని పిలవడానికి కారణం దాని అత్యాధునిక నిఘా సామర్థ్యాలే. భూస్థిర కక్ష్యలో ఉండి భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించగల ఈ ఉపగ్రహం.. అధిక రిజల్యూషన్‌తో స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది. మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ కెమెరాలతో పంటలు, అడవులు, నీటి వనరులు, ఖనిజ సంపదతో పాటు వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల వంటి విపత్తులను దాదాపు రియల్‌టైమ్‌లో పర్యవేక్షించగలదు. సరిహద్దుల్లోని కీలక ప్రాంతాలపై నిఘా పెట్టడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Another giant leap for India in Space!
Kudos to Team @isro on the successful launch of GSLV-F17/EOS-05.
EOS-05 is a state-of-the-art Earth Observation satellite and India’s first imaging satellite from Geosynchronous Orbit, enabling advanced imaging across visible, infrared,… pic.twitter.com/1HHJrWM7ze— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 3, 2026
‘ఈఓఎస్-05’ ప్రత్యేకత ఏమిటంటే?
సాధారణంగా లో-ఎర్త్ ఆర్బిట్, సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లోని ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని చిత్రీకరించడానికి కొంత సమయం తీసుకుంటాయి. అయితే ఈఓఎస్-05 భూస్థిర కక్ష్య నుంచి దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించే సామర్థ్యం కలిగి ఉంది. భారత ఉపఖండాన్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి సమాచారాన్ని పంపగలదు. ఇందులోని ఎంఎక్స్-వీఎన్‌ఆర్ పేలోడ్ అధిక స్పేషియల్ రిజల్యూషన్‌తో చిత్రాలను అందించనుంది. కనిపించే కాంతి, ఇన్‌ఫ్రారెడ్, మల్టీస్పెక్ట్రల్, హైపర్‌స్పెక్ట్రల్ బ్యాండ్లలో సమాచారాన్ని సేకరించగలదు.
రక్షణకు కీలక ఆయుధం
సరిహద్దుల్లోని సైనిక స్థావరాలు, ఇతర కీలక ప్రాంతాలను పర్యవేక్షించడంలో ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఇంతకు ముందు చెప్పినట్లు.. ప్రకృతి విపత్తుల సమయంలోనూ దీని సేవలు కీలకం కానున్నాయి. వరదలు, తుపాన్లు, కార్చిచ్చుల సమయంలో దాదాపు రియల్‌టైమ్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి చిత్రాలను ఉపయోగించుకోవచ్చు. పంటల ఆరోగ్యం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, ఖనిజ సంపద వంటి అంశాలపై కూడా విలువైన సమాచారాన్ని అందిస్తుంది.
పాత వైఫల్యానికి సమాధానం
2021 ఆగస్టులో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 ద్వారా ప్రయోగించిన జీశాట్-1 మిషన్ విఫలమైంది. తాజాగా ఈఓఎస్-05ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం ద్వారా ఆ చేదు జ్ఞాపకానికి ఇస్రో చెక్ పెట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎదురైన పీఎస్‌ఎల్‌వీ వైఫల్యం తర్వాత కూడా శాస్త్రవేత్తలు పట్టుదలతో పనిచేసి తాజా మిషన్‌ను విజయవంతం చేశారు.
వర్షంలోనూ ప్రయోగాన్ని వీక్షించిన 1,500 మంది
ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు లాంచ్ వ్యూ గ్యాలరీకి సుమారు 1,500 మంది తరలివచ్చారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే వర్షం కురుస్తున్నా వారు వెనక్కి తగ్గలేదు. వర్షంలోనే నిలబడి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యాన్ని వీక్షించారు.
ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రయోగం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తొలి మానవ రహిత గగన్‌యాన్ మిషన్‌ను కూడా చేపట్టేందుకు వేగంగా, పద్ధతిగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఆరు ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: వచ్చేస్తోంది.. సూపర్ ఎల్ నినో!


