బీజేపీ తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆయన భార్య రూ.5 కోట్ల వరకు లంచాలు తీసుకుని రేప్ కేసుల సెటిల్మెంట్ దందాను నడుపుతున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం కార్యాలయం అక్రమ దందాకు నిలయంగా మారిందని పేర్కొంది. ఓ రేప్ కేసును కొట్టివేసేందుకు పంజాబ్ సీఎం మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగస్ట్ 21వ తేదీన దర్యాప్తునకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ భండారి మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్, సీఎం మాన్, ఆయన భార్య కలిసి పంజాబ్‌ను ఆప్ లూట్ మోడల్‌గా మార్చారన్నారు. అక్రమ డీల్స్ కోసం సీఎం, ఆయన భార్య పంజాబ్ వ్యాప్తంగా దళారులను నియమించుకున్నారన్నారు. మీడియా భేటీలో భండారి ఓ ఆడియో రికార్డింగ్‌ను వినిపించారు. అందులో దళారీగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ను సూపర్ సీఎంగా పేర్కొనడం, సీఎం సాబ్‌కు కూడా ఈ విషయం చెప్పాం, ఆయన కూడా జోక్యం చేసుకుంటున్నారంటూ ఆ దళారీ, నిందితుడి బంధువుతో చెప్పడం కూడా అందులో ఉన్నాయి.


