సురేఖ బర్తరఫ్‌.. విపక్షాలకు కొత్త అస్త్రం? | BRS and BJP target internal Congress infighting | Sakshi
Sakshi News home page

సురేఖ బర్తరఫ్‌.. విపక్షాలకు కొత్త అస్త్రం?

Sep 4 2026 2:46 AM | Updated on Sep 4 2026 2:46 AM

BRS and BJP target internal Congress infighting

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలపై బీఆర్‌ఎస్, బీజేపీ గురి 

సీఎం సోదరులపై సురేఖ కుమార్తె ఆరోపణలపై విచారణకు పట్టుబట్టే చాన్స్‌ 

సురేఖ ఆరోపణలను అధికార పక్షం ఎలా ఎదుర్కొంటుందనే ఉత్కంఠ 

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ వేయి రోజుల పాలనపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు కొండా సురేఖ బర్తరఫ్‌ అంశం కొత్త అస్త్రాన్ని అందించింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా వేదికగా రేవంత్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలపై రేవంత్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఇకపై కాంగ్రెస్‌పై విమర్శల దాడికి మరింత పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 

సీఎం రేవంత్‌ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కొందరు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు లక్ష్యంగా కొండా సురేఖ కూతురు చేసిన విమర్శలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపలా, బయటా నిలదీసే అవకాశముంది. ఇన్నాళ్లూ కేబినెట్‌లో ఉన్న కొండా సురేఖ నుంచి వచ్చే ప్రతీ విమర్శ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి సృష్టించే అవకాశాలు ఉన్నాయి.  

ప్రజల ముందుకు ప్రభుత్వ వైఫల్యాలు
సురేఖ బర్తరఫ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ అంతర్గత గొడవలను కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్‌ తీసుకెళ్లేందుకు వ్యూ­హ రచన చేస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సురేఖ, ఆమె కు­టుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అ­సెంబ్లీ వేదికగా విచారణ కోసం బీఆర్‌ఎస్‌ పట్టు పట్టే అవకాశముంది. సీఎం సోదరుడికి రూ.200 కోట్ల విలువైన భూ కేటాయింపుపై సురేఖ కుమా­ర్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇన్నాళ్లూ మా­జీ మంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్‌పై ఎదురుదాడికి దిగేందుకు సురేఖ, ఆమె కుమార్తె చేసిన విమర్శలను అ్రస్తాలుగా మలుచు­కునే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

సురేఖ అడుగులు ఎటు?
కొండా సురేఖ బర్తరఫ్‌ అంశాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్‌ కొట్టిపారేస్తోంది. అయితే సీఎం, ఆయన సోదరులు లక్ష్యంగా వస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర తిప్పికొడతారనే అంశంపై కాంగ్రెస్‌ శిబిరంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర స్వేచ్ఛగా ఉన్నారో అందరికీ తెలుసంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. విపక్షాల నుంచి అసెంబ్లీ వేదికగా ఒత్తిడి వస్తే ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతోంది. 

సీఎంను తప్పుపడుతూ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎంత మేర ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంలోనూ కాంగ్రెస్‌లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ వేసే భవిష్యత్తు రాజకీయ అడుగులపైనా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌లో కొనసాగుతూ అధిష్టానంతో రాజీ ధోరణితో వ్యవహరిస్తారా లేక సీఎం లక్ష్యంగా విమర్శలకు పదును పెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌కు దూరమైతే గతంలో బీఆర్‌ఎస్‌తోనూ అనుబంధం ఉన్న సురేఖ భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీ దిశగా అడుగులు వేస్తారనే అంశంపైనా చర్చ జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement