ఆమె ఎవరితో టచ్‌లో ఉన్నారు... పార్టీలో చేరతారా?
కొండా ఫ్యామిలీ చేరితే ప్రయోజనమెంత?
కమల నేతల్లో రకరకాల చర్చలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యనేతలు మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతూ... మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ను చేశారంటూ బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. అయితే కొండా ఫ్యామిలీ బీజేపీవైపు వస్తుందా? వస్తే ఏం చేయాలి? చేర్చుకోవాలా వద్దా? అన్న దానిపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఒకవేళ కొండా మురళి, సురేఖ, సుస్మిత బీజేపీలో చేరితే పార్టీకి ప్రయోజనమెంత? లాంటి అంశాలను విశ్లేషిస్తుతున్నారు. కేబినెట్ నుంచి సురేఖ ఉద్వాసనకు గురైన నేపథ్యంలో... కొండా ఫ్యామిలీ జాయినింగ్‌పై పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పదవిని వదులుకున్నాక ఆమె బీజేపీ వైపు వస్తారా? రావాలనుకుంటే పార్టీలో ఎవరితో చర్చలు జరుపుతారు? పార్టీలో చేరతానంటే చేర్చుకుంటే మంచిదా? కాదా? అన్న రకరకాల చర్చలు బీజేపీలో సాగుతున్నాయి.
వారి ముందున్న మార్గాలేంటి?
రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ వ్యవహారశైలి, ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు తదితరాలు చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎదుట ఉన్న మార్గాలేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొండా ఫ్యామిలీ జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొండాసురేఖ, బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఎదురుపడినపుడు మర్యాదపూర్వకంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సురేఖ రాజీనామా చేశాక అప్పుడు ఆలోచిస్తామంటూ ఊహాగానాలకు తెరలేపారు.
అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు బీజేపీ వైపు నుంచి గానీ, అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచి గానీ ఎలాంటి సమాలోచనలు మొదలుకాలేదనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి పదవి పోయినా సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ, పార్టీకి కూడా రాజీనామా చేయబోనని ప్రకటించిన విషయం విదితమే. ఇతర పార్టీల నేతలు చేరాలంటే ఆ పార్టీ సభ్యత్యానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాకే రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం కండిషన్ పెట్టిన విషయాన్ని రాష్ట్ర పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అందువల్ల సురేఖ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుంటే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు.
ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రాజీనామాకు సురేఖ సుముఖంగా లేకపోగా... పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కండిషన్ అడ్డుగా నిలుస్తోందని చెబుతున్నారు. బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవని... ప్రత్యేక సందర్భాల్లోనే ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల బీజేపీలో కొండా ఫ్యామిలీ చేరడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ పోటీకి క్లెయిమ్ చేస్తున్న సీట్లలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఓటింగ్‌నే సాధించారని అంటున్నారు. అందువల్ల వారి చేరికతో పార్టీకి, నేతలకు కొత్త తలనొప్పి మొదలవుతుందనే గుసగుసలు కూడా బీజేపీలో వినిపిస్తున్నాయి.


